నేడు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

23 Aug, 2019 10:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఈశాన్య మధ్యప్రదేశ్, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది. గురువారం ఏర్పడిన ఉత్తర–దక్షిణ ద్రోణి కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతూ క్రమంగా బలహీనపడుతోంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.

దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, రాయలసీమలోని 4 జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గడచిన 24 గంటల్లో డోన్‌లో 9 సెంటిమీటర్లు, రాయచోటి, ఆత్మకూరు, లక్కిరెడ్డిపల్లి, విజయవాడలో 8 సెం.మీ. వర్షపాతం కురిసింది.

మరిన్ని వార్తలు