అమల్లోకి వాతావరణ బీమా

17 Jul, 2014 02:27 IST|Sakshi
అమల్లోకి వాతావరణ బీమా

అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేరుశనగ పంటకు వర్షాధార వాతావరణ బీమా పథకం (వెదర్‌బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్-డబ్ల్యుబీసీఐఎస్) అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. జూన్ 26వ తేదీ నుంచి పథకం అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ పథకం వర్తించడానికి వీలుగా రైతులు ప్రీమియం చెల్లించడానికి జూలై 31వ తేదీ వరకు గడువు పెట్టారు. అంతలోపు ప్రీమియం చెల్లించిన రైతులకు పథకం వర్తింపజేస్తున్నట్లు పొందుపరిచారు. గతంలో మాదిరిగానే వర్షపాతం, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం, వాతావరణ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 ఆటోమేటిక్ వెదర్‌బేస్ట్ స్టేషన్ల నుంచి రోజువారీ నమోదైన వివరాల ఆధారంగా బీమా వర్తింపజేశారు. హెక్టారుకు బీమా పరిహారం రూ.26,250గా నిర్ణయించారు. ఇందులో 10 శాతం ప్రీమియం వ్యవసాయ బీమా కంపెనీకి చెల్లించాల్సివుంటుంది. ఇందులో రైతు తన వాటాగా హెక్టారుకు రూ.1,312 చెల్లిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.656.25 చొప్పున జమ చేయనున్నాయి. అంటే ఎకరాకు 1,050 ప్రీమియం కాగా అందులో రైతు రూ.525 కడితే... దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరపున చెరో రూ.262.50 చొప్పున జమ చేయనున్నాయి. పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ప్రీమియం జమ చేసుకుంటారు.
 
 రుణాలు పొందని రైతులు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాలని సూచించారు. పథకం అమలులో భాగంగా జూన్ 26 నుంచి జూలై 25 వరకు... జూలై 26 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు... సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నమోదైన వర్షపాతం వివరాలు మూడు దశలుగా పరిగణలోకి తీసుకుంటారు. అత్యల్ప వర్షపాతానికి సంబంధించి జూలై 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు వివరాలు తీసుకుంటారు.
 
 అత్యధిక వర్షపాతానికి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు... అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు రెండు దశల్లో వివరాలు నమోదు చేస్తారు. తెగుళ్లు, చీడపీడల వాతావరణానికి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నమోదైన వివరాలు పరిగణలోకి తీసుకుని పథకం అమలు చేయనున్నారు.
 
 రైతుల్లో ఆందోళన
 ప్రస్తుతం రుణమాఫీ, రీషెడ్యూల్ గందరగోళ పరిస్థితుల నడుమ బ్యాంకర్లు, రైతులు అయోమయంలో పడ్డారు. ఇప్పటివరకు పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల పంపిణీ ప్రారంభం కాకపోవడంతో జూలై ఆఖరు నాటికి ఎలా ప్రీమియం చెల్లిస్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో బ్యాంకుల దగ్గరకు రైతులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రీమియం చెల్లించడానికి 15 రోజులు సమయం చాలదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఏ తల్లి కన్నబిడ్డో..
 ఏ తల్లి కన్నబిడ్డో.. ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో గానీ ఆ శిశువుకు పుట్టీపుట్టగానే నిండు నూరేళ్లూ నిండాయి. రోడ్డుపై విగతజీవిగా మారాడు. కుక్కలకు ఆహారమయ్యాడు.  బుధవారం ఉదయం ధర్మవరం మండలం రేగాటిపల్లి పొలిమేర వద్ద మగ శిశువును కుక్కలు పీక్కుతింటుండటాన్ని గ్రామస్తులు గమనించారు. చుట్టుపక్కల విచారించగా ఎవరూ కన్పించలేదు. అప్పటికే శిశువు మృతి చెందింది. జనం పెద్దసంఖ్యలో తరలివచ్చి మృత శిశువును చూసి ‘అయ్యో పాపం’ అన్నారు. ధర్మవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.         
 - ధర్మవరం అర్బన్
 

మరిన్ని వార్తలు