పెళ్లి.. ఆతర్వాత గోల్డ్, నగదుతో కిలేడీల ఉడాయింపు

27 Aug, 2015 12:26 IST|Sakshi
పెళ్లి.. ఆతర్వాత గోల్డ్, నగదుతో కిలేడీల ఉడాయింపు

♦ నమ్మకంగా వివాహం
♦ బంగారం, నగదుతో ఉడాయిస్తున్న కిలేడీలు
♦ లబోదిబోమంటున్న బాధితులు
♦ మోసాగాళ్లు బెల్గాం, ఇండోర్ ప్రాంతాలకు చెందిన మహిళలు
 
నెల్లూరు ఆచారి వీధిలోని ఓ వ్యాపారికి ఏడాది కిందట కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన ఓ యువతితో వివాహమైంది. వివాహామైన నాటినుంచి ఆ యువతి కుటుంబసభ్యులందరితో సఖ్యతగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బంగారం, నగదుతో ఉడాయించింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు యువతికి ఇదివరకే వివాహమైంది. ఇదే తరహాలో ఆమె గతంలో పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది.
 
మధ్యపతివారివీధికి చెందిన ఓ బంగారు వ్యాపారి ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అతను వ్యాపారానికి వెళ్లిన సమయంలో ఇంట్లోని లక్షలు విలువచేసే బంగారం, నగదుతో ఆమె పరారైంది. పరువుకు వెరిసిన బాధితులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
 
 నెల్లూరు(క్రైమ్) : నెల్లూరు నగరంలో ఇలాంటి నయా మోసాలు నిత్యకృత్యంగా మారాయి. పదులసంఖ్యలో కుటుంబాలు ఇలాంటి మోసాలకు గురై పరువుకు వెరసి బయటకు చెప్పలేక...లోలోపల మదన పడుతున్నారు. నగరంలోని చిన్నబజారు, పెద్దబజారు, ఆచారివీధి, మండపాలవీధి, రేవూరు వారివీధి, కాపువీధి తదితర ప్రాంతాల్లో అధికశాతం మంది బంగారం, కుదువ, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, బట్టల వ్యాపారులు నివసిస్తున్నారు. వీరిలో అధికశాతం మంది రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారు. వీరు వారి స్వస్థలంతో పాటు ముంబై, కర్ణాటక, ఇండోర్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు యువతులతో సంబధాలు కుదుర్చుకుంటున్నారు.

కొందరు యువతుల పుట్టుపూర్వోత్రాలను విచారించకుండానే పెళ్లిళ్ల పేరయ్యల మాటలు నమ్మి వివాహాలు చేసుకుంటున్నారు. వివాహమైన ఏడాది వర కు వారి కాపురం సజావుగానే సాగుతోంది. ఆ యువతి సైతం అందరితో సఖ్యతగానే మెలుగుతూ ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవ ర్తిస్తుంటుంది. భర్త, అత్తింటివారు ఏయే చోట్ల నగదు, ఆభరణాలు భద్రపరస్తున్నారో పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో వాటితో ఉడాయిస్తున్నారు. ఇంట్లో ఉండాల్సిన భార్య ఎక్కడికి వెళ్లిందోనని భర్త ఆరాతీయగా అసలు విషయాలు వెలుగులోకి రావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

 కలవరపాటుకు గురిచేస్తోన్న మోసాలు
 వరుస ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పెళ్లిళ్ల పేరయ్యలు, ఈ మోసానికి పాల్పడుతున్న వారు ముందస్తు ఒప్పందం మేరకే ఈ ఘటనలకు ఒడిగడుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇండోర్, బెల్గాంకు చెందిన ఓ వర్గానికి చెందిన మహిళలు ఇలాంటి మోసాలకు పాల్పడుతూ దర్జాగా దోచుకెళుతున్నారు. వివాహమైన రోజు మినహా మిగిలిన రోజుల్లో ఈ మహిళలు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ భర్తలను దగ్గరకు రానివ్వడం లేదు. అదను దొరకగానే రూ. లక్షల నగదు, నగలతో జెండా ఎత్తేస్తున్నారు.

 ఇలాంటి మహిళలు ఆగడాలు శృతిమించడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమలాగా మరెవ్వరూ మోసపోకూడదని బాధితులు తోటివారిని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వివాహం చేసుకొనే సమయంలో యువతల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే   వివాహం చేసుకోవాలని పోలీసు అధికారులు తెలుపుతున్నారు.
 
మండపాలవీధికి చెందిన ఓ బంగారం పనిచేసే యువకుడికి ఇండోర్‌కు చెందిన ఓ యువతితో వివాహమైంది. యువకుడు పనిచేయగా మిగిలిన బంగారాన్ని ఇంట్లో పెట్టేవాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించుకొని వెళ్లింది. అప్పులపాలైన ఆ యువకుడు నేరాల బాట పట్టాడు.      

మరిన్ని వార్తలు