ఉందిలే మంచి ముహూర్తం.. ముందుముందున

15 May, 2019 13:06 IST|Sakshi

జిల్లాలో శుభకార్యాల సందడి

20  రోజుల పాటు బలమైన ముహూర్తాలు

ఒక్కటి కానున్న వందలాది జంటలు

పశ్చిమగోదావరి, ఏలూరు(సెంట్రల్‌): శుభ ముహూర్తాల కోసం ఎదురు చూసే వారిళ్లల్లో సందడి నెలకొంది. వైశాఖ మాసంలో శుభ ఘడియల్లో జిల్లాలో వందలాది జంటలు  ఒక్కటి కానున్నాయి. పెళ్లి ఏర్పాట్లతో ఆయా కుటుంబాల్లో సందడి నెలకొంది. వైశాఖ, జ్యేష్ట మాసాల్లో సుమారు 20  పెద్ద ముహూర్తాలు  ఉన్నాయిని పురోహితులు చెబుతున్నారు. దీంతో పెళ్లి మండపాలు, బ్యాండ్‌ పార్టీలు, డెకరేషన్‌ సామగ్రి, పురోహితులు, లైటింగ్‌కు డిమాండ్‌  పెరిగింది. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపనలు సైతం ఉపందుకున్నాయి.

రెండు నెలలు మంచి ముహూర్తాలు
ఈ నెల 5వ తేదీ నుంచి జూన్‌ 2వ తేదీ వరకు వైశాఖ మాసం. జాన్‌ నుంచి  జూలై 1వ తేదీ వరకు జ్యేష్ట మాసం కొనసాగుతుంది. ఈ రెండు మాసాలలో మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా సాగుతున్నాయి. మార్చి 31 నుంచి 45 రోజుల పాటు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ప్రజలు ఎటువంటి సుభకార్యాలకు పూనుకోలేదు. బుధవారం నుంచి ఈనెల 30 వరకు మంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 15, 16, 17,19, 23, 25, 26, 29, 30 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహలు జరగనున్నాయి. దాంతో పాటు వచ్చే  జూన్‌లో జ్యేష్ట మాసంలో 8, 9, 12, 13, 17, 19, 20, 22, 26, 27 తేదీల్లో వివాహాలు జరగనున్నట్లు పండితులు తెలిపారు.

జోరుగా సాగుతున్న వ్యాపారాలు
పెళ్లిళల్లో కీలకమైన మంగళ వాయిద్యాలకు మంచి గిరాకీ ఏర్పాడింది. పూర్తిస్థాయి  బ్యాండ్‌ పార్టీలు దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించకపోవడంతో  కొన్ని వాయిద్యాలతోనే సరిపెట్టుకోవాల్సివ స్తోంది. రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు ఈ బ్యాండ్‌ పార్టీలు ధర పలుకుతున్నాయి. పెళ్లి మండపాలను అలంకరించేవారు కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పెళ్లి సమయంలో  ఖర్చుకు ఏమాత్రం వెనుకాడేవారు ఉండడం లేదు.  దాంతో కల్యాణ మండపాలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు  ఖర్చు చేసి  అనేక రకాల పుష్పాలతో మండపాలను ఆకర్షనీయంగా అలకంరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కన్వెన్షన్‌ హాల్స్‌ హవా కోనసాగుతోంది. వాటిలో పెళ్లి జరపడం ఇప్పుడు స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది.

గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం రూ.10 నుంచి రూ.20 వేల మధ్యలో అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం రూ.30 వేల నుంచి  రూ.2 లక్షలు అద్దె తీసుకునే కన్వెన్షన్‌ హాల్స్‌ ఉన్నాయి. మంచి రోజుల్లో వాటిని బుక్‌ చేయించుకునేందుకు చాలా మంది బారులు తీరుతున్నారు. సుమారు 45 రోజుల పాటు ఖాళీగా  ఉన్న  కల్యాణ మండపాలన్నీ వివాహ వేడుకలతో కిటకిటలాడేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి దుకాణాలు వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. వీడియోగ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లకు కూడా చేతినిండా  పని దొరకడంతో వారు  సైతం బిజీ అయిపోయారు.

రెండు నెలల పాటు తీరిక లేదు
చాలా రోజుల తరువాత మంచి ముహుర్తాలు రావడంతో శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి .ఈ రెండు నెలల కాలంలో వందల సంఖ్యల్లో పెళ్లిళ్లు జరుగనున్నాయి. పెళ్లి సీజన్‌ రావడంతో  పెళ్లిళ్లకు సంబంధించిన  డెకరేషన్, సన్నాయి, ఫొటో, వీడియో గ్రాఫర్లు బీజీగా ఉన్నారు.– జి.మణికంఠ, ఫొటోగ్రాఫర్‌

చైత్ర మాసం వెళ్లిపోయింది
ఈనెల 4వ తేదీ నుంచి చైత్ర మాసం ముగిసిపోయింది.    వైశాఖ మాసం ప్రారంభం కావడంతో మంచి రోజులు వచ్చేశాయి. వైశాఖ మాసంలో నగరంలోని పెళ్లిళ్ల  సందడి ప్రారంభమైంది. ఈ మాసంలో మంచి ముహుర్తాలు ఉండడంతో   పెద్ద సంఖ్యలోనే  నూతన జంటలు ఒక్కటి కానున్నాయి.  – ఎన్‌. కృష్ణచైతన్య శర్మ, పురోహితుడు,ఏలూరు

మరిన్ని వార్తలు