మోగనున్న పెళ్లిబాజా

5 Feb, 2019 08:08 IST|Sakshi
అన్నవరం దేవస్థానం

నేటి నుంచి మాఘం మొదలు కానున్న శుభలగ్నాల కోలాహలం

రేపటి నుంచి జోరుగా వివాహాలు

12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి, మార్చి 4న మహాశివరాత్రి పర్వదినాలు

సత్యదేవుని సన్నిధిలో విస్తృతంగా ఏర్పాట్లు  

శుభకార్యాలు నిర్వహించుకోవడం కోసం చాలామంది ఎదురు చూసే మాఘమాసం రానే వచ్చింది. మంగళవారం నుంచి మార్చి ఆరో తేదీ వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. ప్రతి గ్రామంలోనూ పెళ్లిబాజాలు మోగనున్నాయి. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో పెళ్లిళ్లు జోరుగా జరగనున్నాయి. దీంతోపాటు పలు పర్వదినాలు కూడా ఉన్న నేపథ్యంలో దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తూర్పుగోదావరి, అన్నవరం (ప్రత్తిపాడు): జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్‌ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే మార్చి ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా మార్చి 30వ తేదీ వరకూ వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సుముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై సందడి మొదలైంది. వివాహాలు చేసుకునే పెళ్లిబృందాలు ఇప్పటికే సత్రాల్లో గదులు, వివాహ మండపాలను రిజర్వ్‌ చేసుకున్నాయి. ఆ రోజుల్లో ఇతర భక్తులకు వసతి గదులు తక్కువగా మాత్రమే లభ్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. వివాహముహూర్తాల నేపథ్యంలో రత్నగిరిపై పురోహితులు, క్యాటరింగ్, బజంత్రీలకు డిమాండ్‌ పెరిగింది.

పర్వదినాలకు ఏర్పాట్లు
ఇదిలా ఉండగా మాఘమాసంలో వచ్చే పర్వదినాలైన రథసప్తమి, భీష్మ ఏకాదశిని దృష్టిలో ఉంచుకొని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి నాడు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్యనమస్కారాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 16వ తేదీన భీష్మ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి రత్నగిరిపై వ్రతాలు ప్రారంభించడంతోపాటు సత్యదేవుని దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మార్చి నాలుగో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి 12 గంటలకు సత్యదేవుని మూలవిరాట్‌ పక్కనే ఉన్న శివలింగానికి ప్రత్యేక అభిషేకం చేయనున్నారు.

లక్షమంది భక్తులు వస్తారనే అంచనాతో..
భీష్మ ఏకాదశి పర్వదినం నాడు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రత్యేక క్యూ లైన్లు, వ్రతాల కోసం అదనపు మండపాలు అందుబాటులోకి తెస్తాం. భక్తుల కోసం ప్రత్యేక ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం నుంచీ భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేస్తాం.– వి.త్రినాథరావు, ఇన్‌చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం

మరిన్ని వార్తలు