వారం దాటితే దుర్భిక్షమే

14 Aug, 2015 02:13 IST|Sakshi

వేరుశెనగ పెట్టుబడి మట్టిపాలే
తేల్చిచెప్పిన వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు

 
బి.కొత్తకోట: ‘‘వారం రోజుల్లో వర్షం కురిస్తే సరే.. లేదంటే పడమటి మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు               త ప్పవు’’అని తిరుపతి వ్యవసాయ పరిశోధన కేంద్రం సీనియర్  శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. సీనియర్  కీటక శాస్త్రవేత్త టి.మురళీకృష్ణ, జన్యు శాస్త్రవేత్త కె.జాన్, భూసార పరీక్ష శాస్త్రవేత్త టీఎన్‌వీకే.ప్రసాద్ గురువారం బి.కొత్తకోట మండలంలో పలుచోట్ల వేరుశెనగ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ వేరుశెనగ పంటల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పంట ఎండిపోతోందనీ, వారం రోజుల్లో 10 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తేకానీ పంటలను కాపాడుకునే వీలులేదని స్పష్టం చేశారు.

వర్షం కురవకుంటే పంటలపై ఆశలు వదులుకోవచ్చని తేల్చారు. పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందే అవకాశాలు ఏమాత్రం లేవన్నారు. ఇలాంటి వర్షాభావ పరిస్థితులు ఎన్నడూ ఎదురు కాలేదని చెప్పారు. కాగా ఈ నెలఖారులోగా రైతులు ప్రత్యామ్నాయ పంటగా కంది సాగుచేయవచ్చని చెప్పారు. వచ్చే నెలలో మొక్కజొన్న సాగు చేసుకునే వీలుందని చెప్పారు. శనివారం విజయవాడలో జరిగే ఉన్నతస్థాయి అధికారిక కార్యక్రమంలో ఇక్కడి దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రణాళిక రూపొందించాలని నివేదిక ఇస్తామని చెప్పారు. వీరివెంట బి.కొత్తకోట, మదనపల్లె ఏవోలు ఆర్.ప్రేమలత, నవీన్, ఏఈవో ఫైరోజ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు