పోలీసులకు వీక్లీఆఫ్‌లు వచ్చేశాయ్‌!

16 Jun, 2019 03:51 IST|Sakshi

ముందుగా విశాఖ సిటీలో ఈ శనివారం నుంచి అమల్లోకి వచ్చిన సెలవులు

దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు 

సిబ్బంది కొరత ఉన్నా ఇబ్బంది లేదంటున్న పోలీసు ఉన్నతాధికారులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వీక్లీఆఫ్‌ హామీ అమల్లోకి వచ్చేసింది. విశాఖ సిటీలో శనివారం నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. విశాఖతోపాటు మరికొన్ని చోట్లా వీక్లీఆఫ్‌ అమలులోకి రాగా.. దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తెచ్చేందుకు పోలీసు శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని అమలుచేసేందుకు అధికారం చేపట్టిన వారం రోజుల్లోనే ఆయన చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఈ నెల 4న కమిటీ ఏర్పాటుచేశారు. వీక్లీఆఫ్‌ అమలులో వచ్చే ఇబ్బందులను ఈ కమిటీ వారం రోజులపాటు అధ్యయనం చేసింది. అనంతరం ఈ నెల 10న మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సవాంగ్‌తో కమిటీ సమావేశమై వీక్లీఆఫ్‌ అమలుకు నిర్ణయించారు. ఇందుకు సిబ్బంది కొరత ఇబ్బంది కాదని కూడా తేల్చారు. దీంతో ముందుగా విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డా శనివారం ఉత్తర్వులివ్వడంతో నగరంలోని 2,147 మంది సివిల్, 850 ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులకు వీక్లీఆఫ్‌ అమలులోకి వచ్చింది. 

వీక్లీఆఫ్‌ అమలు ఇలా..
- శాంతిభద్రతల విభాగంలో పనిచేసే వారిలో మార్నింగ్‌ షిఫ్ట్, సెక్షన్‌ డ్యూటీలో (రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ చేసేవాళ్లు) ప్రస్తుతం మూడ్రోజులు డ్యూటీ చేసి తర్వాత 36 గంటల పాటు విశ్రాంతి తీసుకునే వారికి అదే విధానం కొనసాగుతుంది. 
జనరల్‌ డ్యూటీ, వారెంట్లు, బందోబస్తు విధులు నిర్వహించే వారికి విధులకు ఇబ్బంది లేకుండా సర్దుబాటుతో ఒక రోజు వీక్లీఆఫ్‌ ఇస్తున్నారు.
ట్రాఫిక్‌ విభాగంలో పనిచేసే వారిని ఏడు రోజులకు ఏడు భాగాలుగా చేసి ఒక్కో భాగానికి ఒక్కో రోజున వారాంతపు సెలవు ఇస్తున్నారు.
నేర పరిశోధన విభాగంలోను సిబ్బందికి స్టేషన్ల వారీగా ఏడు విభాగాలుగా చేసి వీక్లీఆఫ్‌ ఇస్తారు. 
ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో గార్డు, సెక్యూరిటీ కంపెనీ విధులను నిర్వహించే వారికి పరిస్థితులకు అనుగుణంగా, సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని వీక్లీఆఫ్‌ ఇస్తారు. వారికి వీక్లీఆఫ్‌ అమలుచేస్తూనే అత్యవసర సమయాల్లో విధులకు హాజరయ్యేలా అంగీకార పత్రం తీసుకుంటారు.
పోలీసు వాహనానికి ఇద్దరేసి డ్రైవర్లు ఉన్నందున వారిలో ఒకరు విధుల్లో ఉండేలా వీక్లీఆఫ్‌ ఇవ్వనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు