తూనిక యంత్రం... తూతూ మంత్రం...

19 Apr, 2018 07:08 IST|Sakshi
తూనిక యంత్రం

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేయని తూనిక యంత్రాలు

తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుడు నివేదికలే దిక్కు

కొన్ని కేంద్రాల్లో మూలకు చేరిన యంత్రాలు

పొరుగు సేవల పరిశీలనలో బట్టబయలమైన వాస్తవాలు

నమోదవుతున్న లెక్కలన్నీ కట్టు కథలే

జిల్లాలో అప్రమత్తమౌతున్న ఐసీడీఎస్‌ యంత్రాంగం

మనిషి వయసుకు తగ్గ ఎత్తు... అందుకు తగ్గ బరువు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. దీనికోసం శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేశాక ఏ వయసువారు ఎంత ఎత్తు ఉండాలి... ఎంత బరువు ఉండాలనేది నిర్థారించారు. పుట్టబోయే బిడ్డలనుంచి... పుట్టిన తరువాత పూర్తిస్థాయిలో ఎదుగుదల వచ్చేంతవరకూ ఆ లెక్కల ప్రకారమే ఉండాలంటే ఏమేరకు పౌష్టికాహారం అందివ్వాలో కూడా నిర్ణయించారు. అందుకోసం అంగన్‌వాడీ కేంద్రాలను వేదికగా చేశారు. అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతల బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పౌష్టికాహారం ఇవ్వాలని నిర్దేశించారు.కానీ వారి బరువు తెలుసుకునే తూనిక యంత్రాలు మాత్రం నాణ్యమైనవి కాకపోవడంతో అవన్నీ అటకెక్కాయి.

పార్వతీపురం : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అంగన్‌వాడీ కేంద్రాలను కీలకంగా నిర్ణయించారు. అందులోని నవజాత శిశువులు, చిన్నపిల్లలు, గర్భిణులు నిర్దేశిత బరువు కలిగి ఉన్నారో లేదో తెలుసుకునేందుకు రెండు రకాల తూనికల యంత్రాలను సరఫరా చేశారు. వీటిని జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం కింద కొనుగోలు చేసి ఈ కేం«ద్రాలకు సరఫరా చేశారు. వీటిని ఉపయోగించి బరువు నమోదు చేసి రికార్డుల్లో పొందుపరుస్తూ అందుకు అనుగుణంగా వారికి పౌష్టికాహారాన్ని అందించాలని నిర్ణయించారు. చిన్నపిల్లలను ఒక ఓ బ్యాగ్‌లో వేసి తూసే త్రాసును సాల్టర్‌ స్కేల్‌ అని, నిల్చుని తూసే యంత్రాన్ని అడల్ట్‌ స్కేల్‌ అని పిలుస్తారు.

వీటి ద్వారా బరువు తెలుసుకుని అందుకు తగ్గట్టుగా వారికి పౌష్టికాహారం సరఫరా చేయాలి. నాలుగేళ్ల క్రితం సరఫరా చేసిన ఈ యంత్రాలను వినియోగించి ప్రతీ నెలా తూనికలు కొలిచి ఆ వివరాలను రికార్డుల్లో పొందుపరచాలి. కానీ చాలా కేంద్రాల్లో తూనికల యంత్రాలు పూర్తిగా పనిచేయడంలేదు. కొన్ని చోట్ల యంత్రాలు తప్పుడు రిపోర్టులు చూపిస్తున్నాయి. మెషీన్‌లో ఏది చూపెడితే ఆ సంఖ్యనే రికార్డుల్లో నమోదు చేసి అంగన్‌వాడీ కార్యకర్తలు చేతులు దులుపుకోవడం తప్ప అవి వాస్తవాలా కావా అని ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు.

అన్నీ కాకమ్మ లెక్కలే...
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతీ నెలా చిన్నపిల్లలను, గర్భిణులను తూకం వేసి న్యూట్రీషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టం ద్వారా వివరాలను కార్యకర్త నమోదు చేయాలి. కాని చాలా కేంద్రాల్లో ఈ తూనికల యంత్రాలు లేవు. కొన్ని చోట్ల పనిచేయడంలేదు. దీనివల్ల గత నెలలో వచ్చిన గణాంకాలకు కాస్త అటు ఇటుగా కలిపేసి రికార్డుల్లో చూపిస్తూ నివేదికలు పంపించేస్తున్నారు. ఒక వేళ ఎత్తుకు తగ్గ బరువుని పిల్లలున్నా ఆ వివరాలను రికార్డుల్లో చూపించడంలేదు. బరువు తక్కువగా ఉన్నట్టయితే ఆ పిల్లలను జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్సీకి తల్లి, బిడ్డను పంపించాలి. వారిని ఆ కేంద్రానికి పంపించేందుకు వారిని ఒప్పించడం చాలా కష్టం. అందుకని తక్కువ బరువు ఉన్నప్పటికీ అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నమోదు చేసేసి తప్పించుకుంటున్నారు.

లెక్కింపు ఇలా...
తక్కువ బరువున్నవారిని వేర్వేరు నివేదికల్లో పొందుపరచాలి. శాం(సివియర్‌ ఎక్యూర్‌ మాల్‌ నిరస్ట్‌), మేమ్‌లో(మోడరేట్‌ ఎక్యూర్‌ మాల్‌ నరిస్ట్‌) చూపిస్తారు. శాం అంటే అతి తక్కువ బరువు ఉన్నపిల్లలు, మేమ్‌ అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలు. శాంలో ఉన్న పిల్లలను ఎన్‌ఆర్సీకి పంపించాల్సి ఉంటుందని తెలిసి వారిని మేమ్‌లో చూపించి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ఉంచి వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అంతేగాకుండా తూనిక యంత్రాలు పనిచేయని కారణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపభూయిష్టంగా గణాంకాలు నమోదౌతున్నాయి.

ఐటీడీఏ సబ్‌ ప్లాన్‌మండలాల్లో గల కురుపాం ప్రాజెక్టు పరిధిలో 316 తూనిక యంత్రాలు అవసరం కాగా కేవలం 72 ఉన్నాయి. భద్రగిరి ప్రాజెక్టు పరిధిలో 186 అవసరం కాగా చిన్న పిల్లల బరువును నమోదు చేసే స్ప్రింగు తూనిక పరికరాలు 22 మాత్రమే పనిచేస్తున్నాయి. పార్వతీపురంలో 317 పరికరాలు అవసరం ఉన్నా 185 మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాచిపెంటలో 235కు 80 పరికరాలు, సాలూరు ప్రాజెక్టులో 237కు 78 పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 

సర్వేలో వెలుగు చూసిన వాస్తవాలు
ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో శిశువుల ఆరోగ్యం, ఎదుగుదల అంశాలపై తిరుపతికి చెందిన పద్మావతి విశ్వవిద్యాలయం గృహ విజ్ఞానం విభాగం చేత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు తదితర కొన్ని జిల్లాల్లో సర్వే చేయించారు. ఈ సర్వేలో ఐసీడీఎస్‌ ప్రతీ నెలా అందిస్తు న్న గణాంకాలకు ,క్షేత్ర స్థాయిలో వారు చేసిన పరిశీలనలో తెలుసుకున్న గణాం కాలకుచాల వ్యత్యాసాలు ఉన్నట్టు రూఢి అయ్యింది. ఎందుకు ఇలా జరుగుతోంది అన్న కోణంలో పరశీలన జరపగా తూనిక యం త్రాల పనితీరు విష యం వెలుగులోకి వచ్చిం ది.

దీనిని దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో ఉన్న పరిస్థితులు, మూలకు చేరిన తూనిక యంత్రాల బూజు దులిపే పనిలో ఆ శాఖాధికారులు తలమునకలయ్యారు. అసలు జిల్లాల్లో ఎన్ని తూనిక యంత్రాలున్నాయి. వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి. ఎన్ని పనిచేయలేదు. అనే విషయాలపై పీడీ రాబర్ట్స్‌ ఆరా తీస్తున్నారు. పనిచేయని చోట అంగన్‌ వాడీ కార్యకర్తలు నివేదికలు ఎలా పంపిస్తున్నారు. అనే వాస్తవాలను ఐసీడీఎస్‌ సీడీపీఓల ద్వారా తెపించుకుంటున్నారు.

గిరిజన ప్రాంతంలో సమగ్ర సర్వేపై పీఓ దృష్టి
ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపంతో కూడిన శిశువులు నమోదౌతుంటారు. ఇలాంటి చోట్ల తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేయకపోతే మాతా, శిశువుల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఐటీడీఏ సబ్‌ప్లాన్‌ మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న తూనిక యంత్రాల వివరాల సేకరణపై పీఓ డాక్టర్‌ జి.లక్ష్మిశ దృష్టిసారించారు. అవసరమైతే ఐటీడీఏ నిధులతో కొత్తవాటిని కొనుగోలు చేయడం, పాత వాటిని వీలైనంత వరకు మరమ్మతు చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి పీఓ ముందుకు వచ్చారు.

పనిచేయని వాటిని మరమ్మతు చేయిస్తున్నాం...
అంగన్‌వాడీ కేంద్రాల్లో కొన్ని చోట్ల తూనిక యంత్రాలు పనిచేయడంలేదు. అలాంటి చోట్ల పక్క కేంద్రాలనుంచి తూనిక యంత్రాలను తెప్పించుకుని పిల్లల బరువులను తూయిస్తున్నాం. నెలలో ఒకసారి తూయాలి కాబట్టి పొరుగు కేం«ద్రాలనుంచి యంత్రాలను తెప్పించి రిపోర్టు చేస్తున్నారు. త్వరలో అన్ని మెషిన్లు రిపేరు చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నారు. ఐటీడీఏ సహకారంతో గిరిజన ప్రాంతంలో అన్ని కేంద్రాల్లో తూనిక యంత్రాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపడుతున్నాం.
– విజయగౌరి, సీడీపీఓ, పార్వతీపురం 

మరిన్ని వార్తలు