ఇది అందరి ప్రభుత్వం

8 Jun, 2020 03:58 IST|Sakshi

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదలందరికీ సంక్షేమ ఫలాలు

లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం

81.18 లక్షల మందికి ఏడాదిలో రూ.11,022 కోట్ల నగదు జమ

అర్హులందరికీ లబ్ధి కలిగేలా ఏడాది పాలన

వైఎస్సార్‌ రైతు భరోసాతో 18.20 లక్షల మంది 

అగ్రవర్ణ పేద రైతులకు రూ.3,687 కోట్లు

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 14.71 లక్షల మందికి రూ.3,437 కోట్లు

జగనన్న అమ్మఒడి కింద 8.17 లక్షల మందికి రూ.1,225 కోట్లు

సాక్షి, అమరావతి: ఏడాది పాలనలో ఇది అందరి ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించారు. నవరత్నాలు, ఇతర పథకాల లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం తప్ప కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు కాదే కాదని ఆచరణలో అమలు చేసి చూపించారు. గత చంద్రబాబు సర్కారుకు, ఏడాది జగన్‌ సర్కారుకు ఇక్కడే ఎంత తేడా అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నవరత్నాల ఫలాలు అందించడంలో ధనిక, పేద తారతమ్యం మాత్రమే ప్రాతిపదికగా ఏడాది పాలన సాగింది. ఏ ప్రభుత్వానికికైనా ప్రాథమిక సూత్రం పేదరికం నిర్మూలనే. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అగ్రవర్ణాల్లోని పేదలందరికీ నవరత్నాలు, ఇతర పథకాల ద్వారా ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. ఏడాదిలో రాష్ట్రంలోని 81,18,557 మంది అగ్రవర్ణ పేదలకు ఏకంగా రూ.11,022.90 కోట్ల నగదును బదిలీ చేశారు. గత చంద్రబాబు పాలనలో పెన్షన్, రేషన్‌ కార్డు కావాలంటే ఏ పార్టీ.. ఏ కులం అని ప్రశ్నించేవారు. లంచం ఇస్తే తప్ప పని అయ్యేది కాదు. అయితే ప్రస్తుతం అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 

ఇదంతా ఎలా సాధ్యమైందంటే..
► రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు అర్హత నిబంధనలను సడలించారు. మరింత మంది పేదలు అర్హత పొందేలా మార్గదర్శకాలు జారీ చేశారు. 
► ఈ అర్హత మార్గదర్శకాల ఆధారంగానే వైఎస్సార్‌ నవశకం పేరుతో ఇంటింటి సర్వేతో ఆయా పథకాలకు వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయించారు. ఈ ఎంపికలో కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలు చూడకపోవడంతో అగ్రవర్ణాల్లోని 81.18 లక్షల మంది పేదలు భారీ ఆర్థిక ప్రయోజనం పొందారు.

ప్రభుత్వ పథకాలు భేష్‌
మాది ఆర్యవైశ్య కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఉపయోగపడేలా ఉన్నాయి. ముఖ్యంగా విద్యను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పిల్లల చదువులకు ఆసరాగా నిలుస్తున్నాయి. నా కూతురు నాగస్వాతి, కుమారుడు హార్ధిక్‌ రామ్‌చరణ్‌లకు అమ్మ ఒడి, విద్యా దీవెన పథకాలు వర్తించటం సంతోషంగా ఉంది.     
– చీతిరాల అనంతలక్ష్మి, గొట్లగట్టు, కొనకనమిట్ల మండలం, ప్రకాశం

కుల మతాలకు అతీతంగా పథకాలు
మాది కమ్మ సామాజిక వర్గం. సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా కులం, మతం, వర్గం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న కుమార్తె 3వ తరగతి చదువుతోంది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద రూ.15 వేలు నా ఖాతాలో జమయ్యాయి. అలాగే మా కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది.  కేవలం అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవడం వల్లే మాలాంటి వారికీ పథకాలు అందాయి. చాలా సంతోషంగా ఉంది.    
– బోయపాటి మహేశ్వరి, కండ్రిక, విజయవాడ

గత ప్రభుత్వం బ్రాహ్మణుల్ని గుర్తించలేదు
గత ప్రభుత్వం బ్రాహ్మణులను గుర్తించలేదు. మమ్మల్ని డబ్బున్న వాళ్లుగానే భావించారు అంతా. మాలోనూ కటిక పేదలు ఉన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కులం, మతం చూడకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీంతో మాలో చాలా మందికి ప్రభుత్వ పథకాలు మొదటిసారిగా పారదర్శకంగా అందాయి. ఇటీవల కరోనా భృతి రూ.5 వేలు అందాయి. అమ్మ ఒడి ద్వారా రూ.15వేలు వచ్చాయి.
    – ఆకెళ్ల నరసింహమూర్తి, చిట్టివలస, విశాఖ జిలా

రైతు భరోసా ఆదుకుంది
నేను వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. మేం ఓసీల జాబితాలో ఉండటంతో గతంలో  ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ అందేవి కావు. ఏ పథకానికి దరఖాస్తు చేసినా అర్హత ఉండేది కాదు. కానీ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాకు రైతు భరోసా ఆర్థిక సాయం అందింది. నా బ్యాంకు అకౌంట్‌కే నేరుగా నగదు జమ అయ్యింది. వ్యవసాయం చేసుకునేందుకు అవసరమైన నగదు నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఙతలు.  
 – గోనా హరిగోపాలకృష్ణ, బొబ్బిలి, విజయనగరం జిల్లా 

ఏడాదిలో రూ.56 వేల లబ్ధి
కాపు సామాజికవర్గానికి చెందిన నేను ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఏడాది పాలనలో ప్రభుత్వం ద్వారా మా కుటుంబం మొత్తంగా రూ.56 వేల మేర లబ్ధి పొందింది. నాకు ‘వాహనమిత్ర’ పథకం కింద రూ.10 వేల చొప్పున రెండు దఫాలుగా రూ.20 వేలు, మా పిల్లలిద్దరికీ అమ్మఒడి పథకం కింద నా భార్య మహాలక్ష్మి పేరిట రూ.15 వేలు లబ్ధి చేకూరింది. మానాన్నకు రైతు భరోసా పథకం కింద గతేడాది రూ.13,500, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.7,500 ఇచ్చింది. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలతో ఆనందంగా ఉన్నాం.
– బండారు భాస్కర వెంకట సత్యనారాయణ, వాడపాలెం, తూర్పుగోదావరి

సంక్షేమంలో సామాజిక న్యాయం 

మరిన్ని వార్తలు