సంక్షోభం

19 Oct, 2014 04:03 IST|Sakshi
  • నిధుల్లేక పడకేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు
  •  ఉపాధిహామీ కూలీలకు రూ.12 కోట్ల మేర బకాయి
  •  ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థుల ఆందోళన
  •  బకాయిలు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: నిధుల్లేక సంక్షేమాభివృద్ధి పథకాలు పడకేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు.. ఉపాధిహామీ వేతనాలు అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు.

    బకాయిలు చెల్లించడానికే ప్రభుత్వం నిధులను సమకూర్చకపోవడంతో కొత్త పనులను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సాహసించకపోవడం గమనార్హం. బడ్జెట్లో కేటాయించిన నిధులను నిర్దేశించిన సమయంలో విడుదల చేస్తే సంక్షేమాభివృద్ధి పథకాలు ఫలితాలను ఇస్తాయి. కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోతే అటు ప్రజలు.. ఇటు ప్రభుత్వంపై మోయలేని భారాన్ని మోపుతాయడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే అందుకు తార్కాణం.
     
     మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ కింద పనులు చేసిన కూలీలకు రెం డున్నర నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. 4.89 లక్షల మందికి రూ.12 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాలి. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు వేతనాలు అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
     
      2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా విద్యార్థులకు అందలేదు. రూ.75 కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయాలి. కానీ.. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. తక్షణమే ఫీజు చెల్లించాలని అల్టిమేటం జారీచేస్తుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
         
     వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం అత్తెసరు నిధులను విడుదల చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడానికి కాంట్రాక్టర్లు చేసిన పనులకు రూ.11 కోట్ల మేర బిల్లులను ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.
         
     జిల్లాలో పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖలనూ నిధుల కొరత వేధిస్తోంది. కొత్త పనులు ప్రారంభించడం మాట దేవుడెరుగు.. బకాయిలు చెల్లించడానికి కూడా నిధుల్లేవని ఆ శాఖల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల పరిధిలోనూ కాంట్రాక్టర్లకు రూ.32కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లిస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు ఇప్పటికే అల్టిమేటం జారీచేయడం గమనార్హం.
         
     సాగునీటి ప్రాజెక్టులకూ నిధుల కొరత అడ్డంకిగా మారింది. హంద్రీ-నీవా కాంట్రాక్టర్లకు రూ.16 కోట్లు, గాలేరు-నగరి కాంట్రాక్టర్లకు రూ.13 కోట్లు, తెలుగుగంగ కాంట్రాక్టర్లకు రూ.8.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. ఇది ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి దారితీస్తుందని ఆ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
         
     ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులనూ ప్రభుత్వం వేధిస్తోంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని నిరుపేదలు ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తే అప్పులు తీర్చుదామనుకున్న నిరుపేదల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. ఇళ్లను నిర్మించుకున్న పేదలకు చెల్లించాల్సిన రూ.16 కోట్లను చెల్లించకుండా దాటవేస్తూ వస్తుండటం గమనార్హం.
     

మరిన్ని వార్తలు