సరుకులు సరే...నీళ్లు ఎలా..?

10 Jan, 2015 02:19 IST|Sakshi
సరుకులు సరే...నీళ్లు ఎలా..?

ప్రతినెలా సంక్రాంతి కానుక  
ఇస్తేనే నిరుపేదలకు న్యాయం
సరుకుల పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే, చైర్మన్

 
మదనపల్లె: కరువుసీమలోని ప్రజలకు ప్రతినెలా సంక్రాంతి కానుక రూపంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తేనే నిరుపేదలకు న్యాయం జరుగుతుందని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక 8వ చౌకదుకాణంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంక్రాంతి కానుక రూపంలో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారికి ఆరు రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. సంక్రాంతి కానుక అంటూ నిత్యావసర వస్తువులు               ఇస్తున్నారు కానీ వాటిని వండుకుని తినడానికి తాగునీటిని కూడా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నీటి సమస్య కూడా పరిష్కరిస్తేనే ప్రజలకు నిజమైన పండుగన్నారు. గామాల్లో రైతులు రుణాలు మాఫీ జరగకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి పండుగ జరుపుకునే ఉత్సాహంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నో ఆశలతో రుణమాఫీ జరుగుతుందని కలలుగన్న రైత్యాంగానికి ఈ సంక్రాంతి నిరాశే మిగిల్చిందన్నారు.

పేద ప్రజలకు, రైతులకు ప్రభుత్వం బాసటగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించినప్పుడే వారందరికీ నిజమైన సంక్రాంతని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ చైర్మన్ కొడవలి శివప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజలకు సంక్రాంతి కానుక సరుకులను ఎమ్మెల్యే, చైర్మన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీప్రసాద్, కమిషనర్ రాంబాబు, తహశీల్దార్ శివరామిరెడ్డి, సీఎస్‌డీటీ అమరనాథ్, కౌన్సిలర్లు బాబునాయుడు, మస్తాన్‌రెడ్డి, బండి ఆంజినేయులు, బండి నాగరాజు, నాయకులు కోటూరి ఈశ్వర్, ఆంజి, నూర్, పూజారి రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు