ఇస్తే సరి.. లేదంటే

6 Apr, 2017 08:11 IST|Sakshi
ఇస్తే సరి.. లేదంటే
నంద్యాలలో నాలుగు ముక్కలాట!
 
► భూమా, శిల్పా, ఫరూఖ్, ఎస్‌పీవై రెడ్డిలు ఎవరికి వారే..
► సీటు కోసం ముమ్మర ప్రయత్నాలు
► ఇవ్వకపోతే ఇతరులకు సహకరించబోమని స్పష్టం
► పట్టుదలతో శిల్పా
► భూమా బ్రహ్మానందరెడ్డి వైపే అధిష్టానం
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
నంద్యాలలో రాజకీయం వేడెక్కుతోంది. నంద్యాల అసెంబ్లీ సీటు కోసం అధికార పార్టీలో ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. తమకు కావాలంటే తమకే సీటు ఇవ్వాలంటూ ఆ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తామని కొందరు.. ఎదుటి వారికి సహకరించేది లేదని మరికొందరు తేల్చి చెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఒకవైపు భూమా కుటుంబం.. మరోవైపు శిల్పా వర్గంతో పాటు ఫరూఖ్, ఎస్‌పీవై రెడ్డి కుటుంబాలు కూడా రంగంలోకి దిగడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఎవరికి వారుగా సీటు కోసం చేస్తున్న ప్రయత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తనకు సీటు ఇవ్వకపోతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని శిల్పా మోహన్‌ రెడ్డి తెగేసి చెబుతుండగా.. ఒకవైపు ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే ఫరూఖ్‌కు అన్యాయం చేశారనే అభిప్రాయం ఆ వర్గంలో ప్రధానంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఈ సీటు కూడా ఫరూఖ్‌కు ఇవ్వకపోతే ఆ వర్గం పూర్తిగా తమకు దూరం అవుతుందన్న భయం అధికార పార్టీని వెన్నాడుతోంది.
 
మరోవైపు బీజేపీతో ఉన్న పొత్తు కాస్తా తమకు మరింత చెరుపు తెస్తుందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు తామూ బరిలో ఉన్నామని ఎస్‌పీవై రెడ్డి కుటుంబం కూడా సై అంటోంది. అయితే, తమ కుటుంబ వ్యక్తి చనిపోవడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి.. ఈ సీటు తమ కుటుంబానిదేనని భూమా కుటుంబం వాదిస్తోంది. మొతం మీద నంద్యాల సీటు కోసం అధికార పార్టీలో నాలుగు ముక్కలాట ప్రారంభమయ్యింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం భూమా బ్రహ్మానందరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. 
 
పోటీ తప్పదు...!
నంద్యాల అసెంబ్లీ సీటు కోసం మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నేరుగా సీఎంను కలిసి తనకే సీటు ఇవ్వాలని విన్నవించారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో నంద్యాల సీటు తమకు అప్పగించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ సీటు ఇవ్వకపోతే తాను తప్పకుండా పోటీ చేస్తానని ఆయన పేర్కొన్నట్టు  సమాచారం. సమయం లేదు మిత్రమా శరణమా.. రణమా అంటూ శిల్పా మోహన్‌ రెడ్డి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఏ పార్టీ సీటు ఇవ్వకపోతే చివరకు స్వతంత్రంగానైనా పోటీ చేస్తానని ఆయన తన సన్నిహితుల వద్ద ఇప్పటికే వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తన తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డికి శాసన మండలి చైర్మన్‌ పదవి ఇచ్చినంత మాత్రాన తనకు ఒరిగేదేమిటని.. తనకు మాత్రం నంద్యాల సీటు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో నంద్యాల సీటు కొత్త విభేదాలకు ఆజ్యం పోస్తోంది.
 
యాక్షన్‌ రెడీ...!
భూమా కుటుంబం నుంచి బ్రహ్మానందరెడ్డి బరిలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నంద్యాలలో కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. అంతేకాకుండా నంద్యాలలో జరుగుతున్న వివిధ పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. తద్వారా భూమా వారసుడిని తానేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు అధికారపార్టీ కూడా ఈయనవైపే కాసింత మొగ్గుచూపినట్టు సమాచారం. సీటు దాదాపుగా ఈయనకేననే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాన్ని శిల్పా వర్గీయులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ఆయనకు సీటు ఇస్తే చేతులారా తమ నేతను అధికార పార్టీ దూరం చేసుకున్నట్టేనని వ్యాఖ్యానిస్తున్నారు.  
మరిన్ని వార్తలు