కోర్టుకు వెళ్లిన వారి భూముల్నే సేకరిస్తాం

15 May, 2015 02:19 IST|Sakshi
కోర్టుకు వెళ్లిన వారి భూముల్నే సేకరిస్తాం

మంత్రి నారాయణ వెల్లడి
 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణకు అంగీకరించకుండా కోర్టుకు వెళ్లిన వారి భూములపై మాత్రమే భూ సేకరణ చట్టం ప్రయోగిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. రాజధాని భూ సేకరణకు అడ్డంకులు తొలగిస్తూ జీవో నంబర్ 166 జారీ చేశామన్నారు. రాజధాని భూ సమీకరణలో  800 నుంచి 900 ఎకరాలు రాలేదని.. ఆ భూముల్ని భూ సేకరణ ద్వారా స్వాధీనం చేసుకుంటామన్నారు. మిగిలిన వారి భూములకు భూ సేకరణ చట్టం వర్తింపజేయబోమన్నారు. గురువారం సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టంలోని 2, 3 చాప్టర్ల నుంచి కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు మినహాయింపు కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. ఈ జీవోతో రాజధాని నగర అభివృద్ధికి మొదటి దశ మొదలైందన్నారు. ఇప్పటివరకు రాజధాని గ్రామాల్లో పంటలు పూర్తయిన 14,800 ఎకరాలకు ఒప్పంద పత్రాలు అందాయని, 9,203 మంది రైతులకు రూ. 57.66 కోట్లు వార్షిక కౌలు కింద చెల్లించామని పేర్కొన్నారు.రాజధాని భూ అవసరాలకు భూ సేకరణ ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందన్నారు.

 19న సింగపూర్‌కు మంత్రి: మంత్రి పి.నారాయణ ఈ నెల 19న సింగపూర్‌కు వెళుతున్నారు. 19, 20 తేదీల్లో జరిగే ఈ పర్యటనకు మంత్రి నారాయణతో పాటు సీఆర్‌డీఏ డైరక్టర్లు డి.రామకృష్ణారావు, వి.రాముడు వెళుతున్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిధర్ ఉత్తర్వులు జారీచేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో పలు మార్పులు సూచించేందుకు ఈ పర్యటనకు వెళుతున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన అధికారుల బృందంతో హైదరాబాద్‌లో మున్సిపల్ అధికారులు గురువారం భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో ఘన వ్యర్థాల నిర్వహణపై చర్చించారు.
 
 అవసరమైతే ప్రాణాలు ఇస్తాం..

 కేంద్ర ప్రభుత్వం భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే రాష్ట్ర ప్రభుత్వం బహుళ పంటలు పండే భూములు లాక్కోవడం ఎంతవరకు సమంజసం. దీని మీదే ఆధారపడి జీవించే రైతన్నను ఇబ్బందిపాలు చేసేందుకే ప్రభుత్వం రైతు వ్యతిరేక పనులు చేస్తోంది. భూసేకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటాం. అవసరమైతే మా ప్రాణాలు అర్పిస్తాం.
 - చప్పిడి శ్రీరాములు యాదవ్, రైతు, పెనుమాక
 
 ఆత్మహత్యలే గతి...

 చిన్న, సన్నకారు రైతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటోంది. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ అదే పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో అన్నదాతలు బాబుకు తగిన గుణపాఠం నేర్పుతారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే కుటుంబం అంతా ఆత్మహత్యలకు సిద్ధపడతాం.
 - మాదిశెట్టి శివనాగేశ్వరరావు, రైతు, పెనుమాక
 

మరిన్ని వార్తలు