పొలానికి వెళ్లి..నిర్జీవమయ్యాడు!

1 Aug, 2015 02:45 IST|Sakshi
పొలానికి వెళ్లి..నిర్జీవమయ్యాడు!

కురిచేడు : పొలంలో కట్టెలు కొట్టేందుకు సహచరులతో కలిసి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఎన్‌ఎస్‌పీ అగ్రహారం రోడ్డులోని మల్లాయపాలెం పంట పొలాల్లో శుక్రవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మండలంలోని ఎన్‌ఎస్‌పీ అగ్రహారం గ్రామానికి చెందిన తాటి చెంచయ్య(52) మరో ఏడుగురితో కలిసి కట్టెలు కొట్టేందుకు పొలం వెళ్లాడు. మధ్యాహ్నం తర్వాత వారు రెండు జట్లుగా విడిపోయి కట్టెలు కొడుతున్నారు. ఓ చెట్టు కొట్టడం పూర్తయిన తర్వాత మలవిసర్జనకు వెళ్లి వస్తానని తోటి వారితో చెప్పి చెంచయ్య అటుగా వెళ్లాడు.

మిగిలిన ముగ్గురూ మరో జట్టుకు చెందిన నలుగురు కూలీల వద్దకు వెళ్లారు. మేస్త్రి వచ్చి చెంచయ్య గురించి వాకబు చేశాడు. మల విసర్జనకు వెళ్లాడని మిగిలిన వారు చెప్పారు. పొలం కాపలాదారుడు శివారెడ్డి కూడా కూలీల వద్దే ఉన్నాడు. అంతలో శివారెడ్డి భార్య కేకలు వేస్తూ చెంచయ్య పడిపోయాడని చెప్పింది. మిగిలిన కూలీలు వచ్చి కిందపడి ఉన్న చెంచయ్యను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఇంతలో అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నారు. మృతునికి భార్య,నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి మృతదేహాన్ని పరిశీలించి వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చెంచయ్య విద్యుదాఘాతంతో చనిపోయాడా? ఏదైనా విషసర్పం కాటుకు బలయ్యాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు