పౌరుషంగా పనిచేస్తే తిట్టనుగా..

6 Aug, 2016 08:51 IST|Sakshi
పౌరుషంగా పనిచేస్తే తిట్టనుగా..

ఏలూరు : జిల్లాలో ఏ అధికారిని, ఉద్యోగిని కానీ తాను ఎటువంటి మాటలు అననని, కష్టపడి పనిచేసే వారిని ఎంతో ప్రోత్సహిస్తానని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కానీ కొంతమంది విధి నిర్వహణలో పనులు చేయకుండా బయట మీటింగ్‌లు పెట్టి కలెక్టర్ తిడుతున్నాడంటూ ఎందుకు పౌరుషం చూపిస్తున్నారని భాస్కర్ ప్రశ్నించారు. నిజంగా పౌరుషంగా పనిచేస్తే తానెందుకు తిడతానని ప్రశ్నించారు.

జిల్లాలో నిర్దేశించిన పనిని నిర్ణీత కాలవ్యవధిలో పనిచేయించేందుకు తాను సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నానని, అయితే పనులు చేయకుండా నెలల తరబడి జాప్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోనని చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ గ్రామాల్లో అభివృద్ధి పనుల అమలు తీరుపై శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ సమీక్షించారు.

ఆదర్శ గ్రామం అంటే ప్రభుత్వమే అన్నీ చేస్తుందనే ఆలోచన నుంచి ప్రజలు బయటకురావాలని, ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో ఎస్.షాన్‌మోహన్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలు
 ప్రజా సమస్యల పరిష్కారం కాకుండానే పరిష్కరించినట్టుగా అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించిన దేవరపల్లి ఈవోపీఆర్డీ శ్రీనివాసరావును రాతపూర్వకంగా సంజాయిషీ కోరాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌ను ఆదేశించారు. మీ కోసం కార్యక్రమంలో దేవరపల్లి మండలానికి చెందిన శెట్టి కమల తమ గ్రామంలో చెరువులో లే అవుట్ చేస్తూ దారి మార్గం మూసేశారని చేసిన ఫిర్యాదుపై ఏం చేశారని కలెక్టర్ ప్రశ్నించగా సమస్య పరిష్కారమైదని ఈవోపీఆర్డీ ఇ.శ్రీనివాసరావు చెప్పడంపై కలెక్టర్ స్పందించారు. వెంటనే కమలతో ఫోన్‌లో మాట్లాడగా ఈ విషయంపై ఎవరూ రాలేదని సమస్య పరిష్కారం కాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చిన ఈవోపీఆర్డీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు