సంక్షేమం’లో స్వాహా పర్వం 

10 Aug, 2019 11:42 IST|Sakshi

సంక్షేమ హాస్టళ్లకు సరఫరాలో టీడీపీ పెద్దల దోపిడీ 

అధికారుల అడ్డగోలు అవినీతి, దొడ్డిదారిన కొందరికి కీలక బాధ్యతలు 

‘పెద్దల’ బినామీకే టెండర్లు 

రాష్ట్రస్థాయిలో కోట్లాది రూపాయల ఆమ్యామ్యాలు 

ఇప్పటికీ కొనసాగుతున్న అదే కాంట్రాక్టరు, అధికారుల హవా

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సంక్షేమ హాస్టళ్ల మాటున గత పాలకులు, అధికారులు దోచుకుతిన్నారు. అదే అధికారులు ఇప్పటికీ అడ్డంగా దిగమింగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచామని గత ప్రభుత్వం చెబుతూ బినామీ టెండర్లతో దోపిడీకి దారులు తెరిచింది. చిత్తూరు జిల్లాకు చెందిన బినామీ కాంట్రాక్టరు ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించి అవినీతి బాగోతానికి తెరలేపారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లాది రూపాయలు బొక్కేశారు.

40 శాతం అధిక ధరలకు టెండర్లు ఖరారు... 
రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలకు వేరుశనగ అచ్చులు (మిల్లెట్స్‌ కేకులు) సరఫరా చేయడానికి  కిలోకు రూ. 80లు అదనంగా కోట్‌ చేస్తూ గత ప్రభుత్వ పెద్దల బినామీ దారులు టెండర్లు వేశారు. అన్ని సరుకులకు 40 శాతం అధిక ధరలకు టెండర్లు ఆమోదించారు. సరుకును విశాఖపటా్ననికి చెందిన నేషనల్‌ కో–ఆపరేటివ్‌ కన్జూమర్స్‌ ఫెడరేషన్‌ నుంచి కొనుగోలు చేసేవారు.

నాసిరకం సరుకుల సరఫరా... 
టెండరు నిబంధన మేరకు మొదటి రకం సరుకులు సరఫరా చేయకుండా నాసిరకం సరుకులు సరఫరా చేసి కాంట్రాక్టు సంస్థ బాగా దండుకుంది. పాఠశాలలతో ఏమాత్రం సంబంధం లేకుండా రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ద్వారా చెల్లింపులు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పాఠశాల స్థాయిలో అయితే ప్రిన్సిపాళ్లు సరుకు నాణ్యతా ప్రమాణాలు పరిశీలిస్తారని, అందు వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించిన కాంట్రాక్టు సంస్థ, ఉన్నతాధికారులు తెలివిగా ఈ విధానాన్ని అమలు చేశారు.  

జాయింట్‌ సెక్రటరీ ద్వారా చక్కబెట్టేశారు... 
టెండరుదారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తి పడిన రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి ఒకరు ఆరుగొలనుకు చెందిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించే రాజారావుకు రాష్ట్రస్థాయిలో జాయింట్‌ సెక్రటరీగా దొడ్డిదారిలో ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించి ఈ తతంగానికి తెరలేపారు. అంతే కాకుండా కంప్యూటర్లు, సీసీ కెమెరాలకు బిల్లులు చెల్లింపు చేసి గురుకులాల పేరుతో దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి రాజారావు ప్రిన్సిపాల్‌ బాధ్యతలు కూడా పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ రాష్ట్రస్థాయి ఇన్‌చార్జిగా పనులు అప్పగించారు. 

అన్నింటా అవినీతే... 
గురుకుల పాఠశాల కేటరింగ్‌ టెండరుదారుడు ఎనిమిది మందితో పనులు చేయించాల్సి ఉండగా నలుగురు, లేక ఐదుగురిచే పనిచేయించి వారికి తక్కువగా జీతాలు ఇస్తూ మిగులు సొమ్ములు దోపిడీ చేస్తున్నారు. పై సంస్థలలో స్కావెంజర్, స్వీపర్, కాపలాదారుడు ఇలా ప్రతి మనిషికి పది వేల రూపాయలు చెల్లించాలి. కాని వారికి ఏడు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాడు. ఎక్కువ మంది చేయాల్సిన పని తక్కువ మందితో చేయించడంతో వండిన పదార్థాల్లో నాణ్యత లోపించేది. రాష్ట్ర వ్యాప్తంగా రు.6 కోట్లు అవినీతి జరిగినా పట్టించుకునే నాధుడే లేడు. గత ప్రభుత్వం అవినీతికి అండగా నిలిచింది.

సరుకు వివరాలు     టెండరు రేటు     మార్కెట్‌ రేటు     
వేరుశెనగ అచ్చు     రూ.162.50       రూ. 37.00    
పామాయిల్‌           రూ. 90.00        రూ.61.00    
చింతపండు            రూ. 95.00        రూ. 50.00    
గోధుమ రవ్వ         రూ. 44.00        రూ. 27.00    
వేరుశెనగగుళ్ళు     రూ. 128.00       రూ. 100.00    
కారం                   రూ. 285.00       రూ. 145.00     
 

మరిన్ని వార్తలు