అపర సంక్షేమశీలి

22 Oct, 2019 10:23 IST|Sakshi

సాక్షి, ఆకివీడు(పశ్చిమ గోదావరి):  అపరాల రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ పంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ధర ప్రకటించారు. దీంతో అపరాల రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అపరాల కిందకు కందులు, మినుములు, పెసలు తదితర పంటలు వస్తాయి. వీటికి మన నిత్యజీవితంలో ఎంతో ప్రాధాన్యముంది. అయినా ఈ పంటలు సాగు చేసే రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. పంటను దళారులు తన్నుకుపోతున్నారు. అయినా ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వాలూ అపరాల రైతు సంక్షేమంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అపరాల రైతుల సమస్యలపై దృష్టిపెట్టారు. పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధర ప్రకటించారు. అంతేకాదు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకూ చర్యలు తీసుకున్నారు.  ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.

వేల హెక్టార్లలో సాగు 
జిల్లాలో మెట్ట ప్రాంతంతో పాటు, వేసవిలో డెల్టా ప్రాంతంలో రైతులు అపరాల పంటను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో జిల్లా మొత్తం మీద 3 వేల హెక్టార్లలో అపరాలు సాగు అవుతున్నాయి. రబీలో 20 వేల హెక్టార్లలో సాగు జరుగుతుంటుంది. అపరాలను జిల్లాలో  రెండో పంట, మూడో పంటగా సాగు చేస్తున్నారు. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో దళారీ వ్యవస్థకు చరమగీతం పాడినట్టయింది. దీనివల్ల మంచి లాభాలు వస్తాయని, సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం కూడా ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   

మూడో పంట సాగుకు ఊతం 
జిల్లాలోని డెల్టా ప్రాంతంలో రెండు పంటలు (సార్వా, దాళ్వా సాగవుతాయి.) వ్యవసాయాధికారులు మూడో పంట సాగు ద్వారా అదనపు ఆదాయంతోపాటు భూసారం పెరుగుతుందని సూచిస్తున్నారు. కానీ రైతులు మూడో పంటపై అంతగా దృషి సారించడం లేదు. ఈ నేపథ్యంలో అపరాల సాగుకు సర్కారు వెన్నుదన్నుగా నిలవడం వల్ల మూడోపంటకు రైతులు ముందుకొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. వేసవిలో ఆరుదల, పచ్చిరొట్ట పంటలుగా సాగు చేస్తున్న అపరాల సాగును శ్రద్ధగా చేసేందుకు రైతులు సమాయత్తమయ్యే ఆస్కారం ఉంది. ప్రస్తుతం మద్దతు ధర ప్రకటనతో మినుములు, పెసలతోపాటు శనగ, కందులను సాగు చేసేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. 

రబీలో అపరాల సాగు ఎక్కువ
జిల్లాలో అపరాల సాగు రబీలో అధికంగా ఉంటుంది. ఖరీఫ్‌లో 3 వేల హెక్టార్లలో మాత్రమే ఉంది. రబీలో 25 వేల హెక్టార్లలో మినుము, పెసలు, పిల్లిపెసర, కందులు, శనగలు తదితర అపరాల సాగు చేస్తున్నారు. అపరాల సాగుకు రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందజేస్తున్నాం.
– గౌసియా బేగం, జేడీ, వ్యవసాయశాఖ, ఏలూరు

మద్దతు ధర సాహసోపేత నిర్ణయం
అపరాలకు మద్దతు ధర ప్రకటించడం సాహసోపేతమైన చర్య. అపరాల సాగుతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థ వల్లే ధర లభించడంలేదు. విత్తనాలు కూడా నాణ్యమైనవి లభించడంలేదు. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలి. 
– జి.ఎన్‌.ఆంజనేయులు, అపరాల సాగు రైతు, నల్లమడు 

మద్దతు ధర ప్రకటించడం ఆనందంగా ఉంది
మెట్ట ప్రాంత మినపగుళ్లు నాణ్యమైనవి. అయినా ధర పలకడంలేదు. నేను రెండున్నర ఎకరాల్లో మినుము సాగు చేస్తున్నా. భారీగా పెట్టుబడులు పెట్టినా.. ఆరుగాలం శ్రమించినా లాభాలు దక్కడంలేదు. దళారుల వ్యవస్థ పెరిగిపోయింది. ఎకరాకు రూ.35 వేలు పెట్టుబడి పెడితే, దిగుబడి మాత్రం 5,6 బస్తాలు వస్తుంది. బస్తా రూ.4,000, రూ.4,500లకు అమ్ముకుంటున్నాం. పెట్టుబడులు పోను రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ నష్టం వస్తోంది. మా కష్టాలను గుర్తించి సీఎం జగన్‌ రైతు భరోసా వర్తింపజేయడంతోపాటు తొలిసారిగా అపరాల పంటకు మద్దతు ధర ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ నిర్ణయాల వల్ల  రైతులకు రూ.6 వేలకు పైబడి మిగులు కన్పించవచ్చు.  కొనుగోలు కేంద్రాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం. దీనివల్ల దళారుల వ్యవస్థ కనుమరుగవుతుంది. 
– గౌతు బాలభాస్కర్, అపరాల సాగు రైతు, రామచంద్రాపురం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా