కరోనా విధుల్లో ఉన్నా కేసులే

30 Apr, 2020 13:28 IST|Sakshi

కొవ్వూరులో వివాదాస్పదంగా పోలీసు అధికారి తీరు

విధులు నిర్వహించలేమని తేల్చి చెప్పిన సిబ్బంది

సమస్యను సర్దుబాటు చేసిన ఆర్డీఓ

సాక్షి ప్రతినిధి, పశ్చిమ గోదావరి, ఏలూరు: కొవ్వూరు డివిజన్‌లో పనిచేస్తున్న పోలీసు అధికారి తీరుపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కొవ్వూరు పట్టణంలో కరోనా విధులు నిర్వర్తిస్తున్న వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మునిసిపల్‌ సిబ్బందికి చెందిన మోటారు సైకిళ్లు ఆపి ఆన్‌లైన్‌లో ఫైన్‌లు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. గుర్తింపు కార్డులు, వెహికల్‌ పాసులు చూపినా.. ఆపి మరీ హెచ్చరికలు చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఒక ఏఎన్‌ఎం రెడ్‌జోన్‌ పరిధిలో శాంపిల్స్‌ సేకరణకు వెళ్తుండగా ఆపి ప్రశ్నించారు.

విషయం చెప్పినా వినిపించుకోకుండా ఆమె వాహనానికి ఫైన్‌ వేశారు. మున్సిపల్‌ సిబ్బందికీ ఇదే సమస్య ఎదురైంది. ఇబ్బందులకు గురి చేస్తే బుధవారం నుంచి విధులకు రాలేమని మున్సిపల్‌ కమిషనర్‌ వద్ద వారు గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం వార్డు వలంటీర్‌ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థులకు సైతం చేదు అనుభవం ఎదురైంది. ధ్రువీకరణ పత్రాలు చూపినా పట్టించుకోకపోవడంతో సాయంత్రం వరకు వారు మున్సిపల్‌ కార్యాలయంలోనే ఉండిపోయారు. ఆ అధికారి తీరును కమిషనర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాగైతే మున్సిపాలిటీ తరఫున తాము కూడా సహాయ నిరాకరణ చేయాల్సి వస్తుందని అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆర్డీఓ రంగంలోకి దిగి సమస్యను సర్ధుబాటు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు