ఆశల జనవరి

1 Jan, 2020 13:24 IST|Sakshi
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏలూరులో యువత సంబరాలు

ప్రగతి వైపు పరుగులు సంక్షేమ సిరుల ఝరి

వేగం పుంజుకుంటున్న పోలవరం

వైఎస్సార్‌సీపీలో నవోత్సాహం  

తెలుగుదేశంలో నిరాశ

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకు నిలువెత్తు నిదర్శనంగానిలిచిన 2019 ద్వితీయార్థంలో సంక్షేమ సిరులు కురిపించి కాలగమనంలో కలిసిపోయింది. కొంగొత్త ఆశలతోమరో కొత్త వత్సరం జనజీవితాల్లోకి అరుదెంచింది. ఆనంద సంబరాలతో నవశకానికి నాంది పలికింది.  

సాక్షిప్రతినిధి, ఏలూరు: కొత్త సంవత్సరం 2020లో జిల్లా ప్రగతి వైపు అడుగులు వేయనుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే సంక్షేమ సంతకంతో జిల్లాపై తనదైన ముద్ర వేసింది. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల సవారీ చేస్తూ ముందుకు సాగుతోంది. జనవరి నుంచి సంక్షేమ ఝరి పరవళ్లు తొక్కనుంది. ఆనందాలు నింపనుంది.అందరికీ ఇళ్లు లక్ష్యంగా..  మరో రెండురోజుల్లో జిల్లా కేంద్రం ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఆయన ప్రభుత్వం శతవిధాలా యత్నిస్తోంది. ఉగాది నాటికి జిల్లాలో ఇళ్లు, ఇళ్ల స్థలం లేని వారు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే పాలనను తీసుకువచ్చింది. 

మంచికే విజయం  
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు దుష్టశిక్షణ, శిష్ట రక్షణ అనే నానుడిని గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్‌ సీపీకి ఘన విజయం అందించారు. జిల్లాలోనూ ఆ పార్టీ 13 స్థానాల్లో జయ కేతనం ఎగురవేసింది. ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు పెద్ద పీట వేశారు. జిల్లాకు చెందిన నేతలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు మరో రెండు మంత్రి పదవులు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కమిటీ అధ్యక్ష బాధ్యతలు కూడా జిల్లాకు చెందిన కొట్టు సత్యనారాయణకు అప్పగించారు.

సంక్షేమ పథకాల అమలులో ముందంజ
పాదయాత్రలో ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దూసుకుపోతున్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏలూరు నుంచే వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 13 వేల మందికిపైగా లబ్ధి చేకూరింది. డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా రికార్డు స్థాయిలో అమలు చేసి సీఎం జేజేలు అందుకున్నారు.  జిల్లాలో 3,09,057 మంది రైతులకు రూ.2,43,20,39,500 చెల్లించారు.  కౌలు రైతులకు దేశంలోనే తొలిసారిగా అండగా నిలిచిన ప్రభుత్వాధినేతగా సీఎం జగన్‌ కీర్తిపుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. జిల్లాలో 899 మంది చేనేతలకు రూ.24వేల వంతున చేయూత అందించారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం అమలు కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పు తీసుకు వచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1,058 పాఠశాలల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 16,552 మంది వలంటీర్లను నియమించారు. 938 సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏడు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన పోస్టులనూ త్వరలో భర్తీ చేయనున్నారు.  ఉగాది నాటికి 2.60 లక్షల ఇళ్ల పట్టాలు  పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలోనే స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఆరోగ్యశ్రీ పథకం పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు పశ్చిమగోదావరి జిల్లా వేదిక కానుంది. 

ప్ర‘జల సమస్య’ను గుర్తించి
సీఎం జగన్‌ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు గుర్తించిన తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారంలోకి రాగానే పరిష్కార మార్గం చూపారు.  రూ.4వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పథకానికి రూపకల్పన చేశారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో వైఎస్సార్‌ సీపీలో నవోత్సాహం తొణికిసలాడుతోంది. 

నైరాశ్యంలో టీడీపీ, ప్రతిపక్షాలు  
మరోవైపు ఘోరమైన ఓటమి చవిచూసిన తెలుగుదేశం నానాటికీ నైరాశ్యంలో మునిగిపోతోంది. అమరావతి రాజధాని పేరుతో రాజకీయం చేసేందుకు చూస్తున్నా ప్రజల నుంచి మద్దతు రావడం లేదు. ఏలూరు మాజీ శాసనసభ్యుడు బడేటి బుజ్జి ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటుగా మారింది.అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను వేధించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రెండునెలలు వివిధ కేసుల్లో జైలు జీవితం గడిపి వచ్చారు. చంద్రబాబునాయుడు రెండురోజుల పాటు జిల్లాలో మకాం వేసి  దిశానిర్దేశం చేసినా పార్టీలో ఇంకా స్తబ్దత కొనసాగుతోంది. ఇక జనసేన అ«ధ్యక్షుడే భీమవరం నుంచి పోటీ చేసినా ప్రజలు ఘోర పరాజయాన్ని అందించడంతో జనసేన నైరాశ్యంలో మునిగిపోయింది. గత ఎన్నికల్లో పొ త్తుల్లో భాగంగా ఒక ఎంపీ,  ఎమ్మెల్యే సీటు గెలుచుకున్న బీజేపీ ఎక్కడా డిపాజిట్లు కూడా పొందలేని స్థితి నెలకొంది. వామపక్షాలు తమ ఉనికి కోసం పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు