కాశీలో చిక్కుకున్న ఏలూరు నగర వాసులు

27 Mar, 2020 13:18 IST|Sakshi
కాశీలో చిక్కుకుపోయిన ఏలూరు నగర వాసులు వీరే

పశ్చిమగోదావరి,ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కాశీకి వెళ్లిన ఏలూరు నగర వాసులు కొంతమంది కాశీ పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయారని, వారిని నగరానికి రప్పించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని వారి బంధువులు ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన మీనంబాకం ఆనంద్‌ ఆయన కుటుంబ సభ్యులు 12 మందితో పాటు నగర పరిసర ప్రాంతాలకు చెందిన మరో 18 మంది కలిపి మొత్తం 30 మంది కాశీ యాత్రకు బయలుదేరి ఈ నెల 16వ తేదీన అక్కడకు చేరుకున్నారు. అక్కడ నుంచి వారు తిరుగు ప్రయాణమవుదామనుకున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎటువంటి రవాణా సౌకర్యం లేక అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారు ప్రస్తుతం ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉండడం లేదని, కనీసం ఆహారం కూడా అందక దుర్భర పరిస్థితిలో ఉన్నామని వేదన వ్యక్తం చేస్తూ తమ బంధువులకు సమాచారం చేరవేశారు. ఈ మేరకు ఆనంద్‌ కుమారుడు దుర్గా ప్రసాద్‌ తమ తండ్రి, బంధువులను అక్కడి నుంచి ఎలాగైనా స్వస్థలాలకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు