ఆ.. రుణాల మాటేంటి?

15 May, 2015 03:56 IST|Sakshi

మరణించిన రైతుల గురించి నోరెత్తని అధికారులు
రూ.కోట్లలో బకాయిలు.. చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు
ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలు

 
 సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నెల్లూరులో నివాసం ఉంటున్న రమణారెడ్డి ఏడాది క్రితం అనారోగ్యంతో మరణించారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఐదెకరాల పొలం ఉంది. అందులో పంట సాగు చేసేందుకు రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.లక్ష రుణం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన  రైతు రుణమాఫీకి ఇతను అర్హుడేనని బ్యాంకు అధికారులు అర్హుల జాబితాలో చేర్చారు.

అయితే ప్రభుత్వం రెండువిడతలుగా ప్రకటించిన రైతు రుణమాఫీ జాబితాలో ఇతని పేరులేదు. బ్యాంకర్లు ఇతను తీసుకున్న బకాయి వెంటనే చెల్లించాలంటూ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న రమణారెడ్డి కుటుంబ సభ్యులు బ్యాంకర్లను కలిశారు. రైతు రుణమాఫీకి తాము అర్హులమేనని వివరించారు. అందుకు సంబంధించిన పాసుపుస్తకం, రేషన్‌కార్డు చూపించారు. అయితే ఆధార్‌కార్డు లేదు. దీంతో బ్యాంకర్లు వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అధికారులను కలవమని పంపేశారు.

దీంతో రమణారెడ్డి భార్య లక్ష్మమ్మ కలెక్టరేట్‌కు వచ్చి రెవెన్యూ అధికారిని కలిశారు. తన భర్త తీసుకున్న రుణం మాఫీ అవుతుందా? అవ్వదా? వాస్తవంగా అయితే తన భర్త తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే ఆ బకాయి చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. అందుకు అధికారి ఒకరు ‘మీ భర్త మరణించిన విషయం మాకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత అతని వివరాల కోసం ఆన్‌లైన్‌లో అన్వేషించారు. అయితే అందులో ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఏం చెప్పాలో తెలియక ‘మీరు డెత్ సర్టిఫికెట్ తీసుకురండి. ఆ తరువాత ఏం చేయాలో చెబుతాం’ అని సమాధానం ఇచ్చి పంపేశారు.

 ఆందోళనలో రైతు కుటుంబాలు.. అయోమయంలో అధికారులు
 అనారోగ్యంతోనో.. ప్రమాదవశాత్తు మరణించిన రైతులు జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. వారిలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతులు సుమారు 2,700 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. వీరు తీసుకున్న రుణాలు రూ.కోట్లలో ఉన్నట్లు తెలిసింది. కుటుంబ యజమాని మరణించడంతో బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకర్లు కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. మరి కొందరు తీసుకున్న రుణం  చెల్లించేసి.. ప్రభుత్వం రుణమాఫీ కింద బ్యాంకులకు చెల్లించిన మొత్తాన్ని తీసుకునేందుకు తిరుగుతున్నారు.

అలాగే నాయుడుపేటకు చెందిన రైతు కృష్ణయ్య  కొడుకు గురువారం కలెక్టరేట్‌కు వచ్చి రుణమాఫీ సెల్‌లో పనిచేసే అధికారిని కలిశారు. తన తండ్రి రూ.75 వేలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. తీసుకున్న రుణానికి సంబంధించి రూ.25 వేల వరకు  చెల్లించినట్లు వివరించారు. అయితే రుణమాఫీ జాబితాలో తండ్రిపేరు ఉందని, అందుకు సంబంధించి మొదటి విడత కొంత మొత్తం కూడా ప్రభుత్వం చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే బ్యాంకర్లు రకరకాల ప్రశ్నలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అధికారి తానేమీ చేయలేనని బ్యాంకు వారినే కలవమని చెప్పి పంపేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మరణించిన కుటుంబాల వారు రుణమాఫీకి సంబంధించి రకరకాల సమస్యలతో బ్యాంకర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.  

 మరణించిన రైతులకు సంబంధించి నిబంధనలు రాలేదుః -వెంకటేశ్వరావు, లీడ్ బ్యాంక్ మేనేజర్, నెల్లూరు
 జిల్లాలో మరణించిన రైతులు వందల సంఖ్యలో ఉన్నారు. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి నిబంధనలు ఏవీ రాలేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. నిబంధనలు వచ్చాక తెలియజేస్తాం.

>
మరిన్ని వార్తలు