అసలు దొంగల సంగతేంటి ?

9 Sep, 2014 03:38 IST|Sakshi
అసలు దొంగల సంగతేంటి ?
 • 196 మంది స్మగ్లర్లతో పోలీసుల జాబితా!
 •  విచారణలో మరో 800మంది పేర్లు వెల్లడి
 •  21 మంది విదేశీయులు, నలుగురు ఎన్‌ఆర్‌ఐల పేర్లు గుర్తింపు
 •  విదేశీ స్మగ్లర్లను ఇంటర్‌పోల్ సాయంతో అరెస్టు చేస్తామన్న నాటి ఎస్పీ రామకృష్ణ
 •  రెండున్నరేళ్లుగా పురోగతికి నోచుకోని ఇంటర్‌పోల్ అరెస్టులు
 • సాక్షి, చిత్తూరు: తీగలాగితే డొంక కదిలినట్లు...ఎర్రచందనం స్మగ్లర్ల విచారణలో దొంగల పేర్లు బయటకి వచ్చాయి. 196 మంది స్మగ్లర్లతో జాబితాను సిద్ధంచేసి ‘ఆపరేషన్ రెడ్’ను పోలీసులు ప్రారంభించారు. చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి అర్బన్, నెల్లూరు జిల్లాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా అరెస్టుల పర్వాన్ని సాగించారు.

  అందులో ఇప్పటి దాకా 181 మంది దొంగలను అరెస్టు చేశారు. వారిని విచారిస్తే అదనంగా మరో 800మంది పేర్లు వెలుగులోకి వచ్చాయి. అలాగే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ప్రస్తుతం పలు పదవుల్లో ఉన్న ‘ఖద్దరు’ నేతల పేర్లు కూడా విచారణలో స్మగ్లర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. వీరిలో చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలతోపాటు కర్ణాటక, తమిళనాడుకు చెందిన ప్రజాప్రతినిధుల పేర్లు కూడా దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.
   
  ఆ 25 మంది అరెస్టుల సంగతేంటి?

  ఎర్రచందనం స్మగ్లింగ్‌లో లక్ష్మణన్, శరవణన్, అసీఫ్ అలీఖాన్, లక్ష్మణ్ నాయక్, రియాజ్, హమీ ద్, విక్రమ్ మెహందీ లాంటి అంతర్జాతీయ స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో చైనా, మలేషియా, జపాన్, థాయ్‌లాండ్‌కు చెందిన 21 మంది విదేశీయుల పేర్లు బయటకొచ్చాయి. ఇండియాకు చెందిన అంతర్జాతీయ స్మగ్లింగ్ వ్యాపారంలో ఆ 21 మంది కీలక పాత్ర పోషించారని పోలీసులు తేల్చారు. వీరితో పాటు చైనాలో స్థిరపడిన నలుగురు భారతీయులను కూడా చిత్తూరు పోలీసులు గుర్తించారు. ఈ 21 మంది అరెస్టు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు.

  ఇంటర్‌పోల్ సాయంతో వారిని అరెస్టు చేయాలని పోలీసులు భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వారి అరెస్టుల్లో పురోగతి సాధించలేదు. వారితో పాటు దేశానికి చెందిన మరో 800 మంది దొంగల అరెస్టు కూడా పూర్తిగా మందగించింది. ఎస్పీ రామకృష్ణ బదిలీ అయిన తర్వాత పోలీసులు ఎర్ర స్మగ్లర్ల అరెస్టు ప్రక్రియలో పూర్తిగా నెమ్మదించారు. అప్పటి ఎస్పీ అరెస్టు చేసిన 12 మంది దొంగలపై పీడీ యాక్టు నమోదు చేయడం మినహా, విచారణలో వెల్లడైన దొంగలను అరెస్టు చేయలేదు. ‘ఆపరేషన్ రెడ్’ మొదలైన తర్వాత 40 రోజుల్లో 174 మందిని అరెస్టు చేస్తే..వారి అరెస్టు తర్వాత రెండునెలల్లో ఒక్క అరెస్టు కూడా లేదంటే పోలీసులు పనితీరు ఎలా ఉందో ఇట్టే తెలుస్తుంది.

  గ్లోబల్ టెండర్లలో చక్రం తిప్పుతున్న ఆ 25 మంది

  కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపిన 25 మంది, విదేశాల్లోని స్మగ్లర్ల కనుసన్నల్లోనే ఎర్రచందనం గ్లోబల్ టెండర్ల ప్రక్రియ సాగుతున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. గోడౌన్లలోని దుంగలను చూసేందుకు ఈ 25 మందికి చెందిన అస్మదీయులు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశాలకు చెందిన ఈ వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ ధరలకు టెండర్లు కోట్ చేయకుండా పక్కా ప్రణాళిక ప్రకారం టెండర్లు దక్కించుకునేందుకు ఆ 25 మంది వ్యూహం రచించి దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారని తెలుస్తోంది.
   
  ఇప్పటి వరకు దుంగల దొంగలపైనే పోలీసుల దృష్టి

  పోలీసులు ఇప్పటి వరకు ఎర్రచందనం స్మగ్లింగ్ లో నేరుగా ప్రమేయం ఉన్న వ్యక్తులనే(దుంగలను కొట్టించడం, క్రయవిక్రయాలు, రవాణాతో సం బంధం ఉన్నవారు)అరెస్టు చేస్తున్నారు. స్మగ్లింగ్ లో రాజకీయ కోణం, ఏయే నాయకుడు ఏ స్మగ్లర్‌కు అండగా నిలిచాడు. స్మగ్లర్లు ఏ నాయకునికి ఎంత డబ్బులు ముట్టజెప్పారు? అనే కోణంలో పోలీసులు విచారణతో పాటు అరెస్టుకు ఉపక్రమించలేదు. పోలీసులు సిద్ధం చేసుకున్న స్మగ్లర్ల జాబితా 196 నుంచి వెయ్యికి పెరిగినా దొంగలను పూర్తిగా అరెస్టు చేస్తే, ఆపై ‘ఖద్దరు’ నేతల పని పడతామని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి చెప్పా రు. అయితే వీరిలో అధికంగా టీడీపీకి చెందిన నేతల పేర్లు ఉన్నాయి.

  ఈ క్రమంలో వీరిని అరెస్టు చేసేందుకు అధికారపార్టీ పోలీసులకు స్వేచ్ఛనివ్వడం కష్టమే. దీంతో వారి అరెస్టులు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కనీసం ఇతని అరెస్టును కూడా మీడియాకు చూపకుండా నేరుగా కోర్టుకు హాజరుపరిచారంటే పరిస్థితి ఇట్టే తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు దొంగలను అరెస్టు చేసేందుకు పోలీసులపై ‘పచ్చనేతల’ ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. అసలు దొంగలను వదిలేసి చిన్న దొంగలతో కేసును ‘మమ’ అనిపిస్తే...‘ఎర్ర’ వ్యాపారానికి మళ్లీ సర్కారు గేట్లు తెరిచినట్లే అవుతుంది.
   
  నాడు ఎస్పీ ఏమన్నారంటే..

  ‘196 మంది దొంగలతో జాబితా సిద్ధం చేసి అరెస్టు ప్రక్రియను ప్రారంభించాం. వీరిలో 174 మందిని అరెస్టు చేశాం. విచారణలో మరో 800 మంది దొంగల పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 21 మంది విదేశీయులు ఉన్నారు. నలుగురు విదేశాల్లో స్థిరపడిన భారతీయులు ఉన్నారు. వీరి జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపాం. ఇంటర్‌పోల్ సాయంతో వారిని అరెస్టు చేస్తాం.’
   -పీహెచ్‌డీ రామకృష్ణ, నాటి చిత్తూరు ఎస్పీ
   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా