ఏం తమాషా చేస్తున్నారా..!

22 Mar, 2018 13:47 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కారెం శివాజీ

ఎస్సీ,ఎస్టీ హక్కులకు భంగం కలిగిస్తే్త చర్యలు

ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ

విజయనగరం పూల్‌బాగ్‌/ అర్బన్‌: ఎస్సీ,ఎస్టీ కేసులంటే లెక్కలేదా.. అధికారులు తమాషా చేస్తున్నారా.. అని ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ మండిపడ్డారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎస్సీ, ఎస్టీల హక్కులకు భంగం కలిగించినా.. ఎస్సీ, ఎస్టీ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార బాధితులకు న్యాయం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా పూసపాటిరేగ మండలం ఎరుకొండలో సాంఘిక బహిష్కరణకు గురైన కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు ఈ నెలాఖరునాటికి ఖర్చుచేసి వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ నియామకాల్లో తప్పనిసరిగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. పోలీసు యంత్రాంగం, ఎస్సీ,ఎస్టీ బాధితులకు అండగా నిలబడకపోగా వారిపైనే కేసులు పెట్టడం శోచనీయమని తెలిపారు. అనంతరం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలుపరుస్తున్న కార్యక్రమాలను శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీసు, సాంఘిక సంక్షేమశాఖ, అటవీ, వ్యవసాయ, మత్య్స, పశుసంవర్థక , విద్యుత్, ఉద్యానవన, పంచాయతీరాజ్‌శాఖ, సర్వశిక్షాభియాన్‌ అధికారులు తమ శాఖల ప్రగతి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకీ చర్యలు చేపట్టామన్నారు. దళిత, గిరిజన విద్యార్థులకు సకాలంలో పోస్టుమెట్రిక్, ప్రీ మెట్రిక్‌ ఉపకారవేతనాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్న 126 మందికి రూ.60 లక్షల వివాహ ప్రోత్సాహకాన్ని అందించామని వివరించారు. ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6.6 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ సభ్యులు కె రాజారావు, సిరివేలు సోమ, సుధారాణి, రవీంద్ర, నరహరి వరప్రసాద్, ఎస్టీ కమిషన్‌ ఓఎస్‌డీ సుబ్బారావు, జేసీ–2 కె. నాగేశ్వరరావు, డీఆర్‌ఓ ఆర్‌ఎస్‌ రాజ్‌కుమార్, అడిషనల్‌ ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి కారెం శివాజీ, జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి పూలమాలలు వేసి నివాaళులర్పించారు.  

మరిన్ని వార్తలు