మన అరటి.. ఎంతో మేటి!

17 Oct, 2019 09:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: మన ప్రాంత అరటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సత్తా చాటుతోంది. ఎగుమతులను పెంచుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్సిటీ కొనుగోలుదారులు, అమ్మకందారులతో ఇప్పటికే ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో అరటి సాగుదారులకు మరింత ప్రయోజనం కలగనుంది.

మన అరటి విశేషాలివీ..
రాష్ట్రంలో 1,12,995 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఏటా 63,84,730 టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరటి సాగవుతుండగా.. విస్తీర్ణం, ఉత్పత్తిలో కడప ప్రథమ స్థానంలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి.

మధ్య ప్రాచ్య దేశాలైన యూఏఈ, బెహ్రయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్‌ దేశాల్లో మన అరటికి మంచి డిమాండ్‌ ఉంది.

గ్రీన్‌ కావెండిష్‌ ప్రీమియమ్‌ రకాలు ఆ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2016–17లో 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి కాగా.. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 మెట్రిక్‌ టన్నులకు ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల మెట్రిక్‌ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం కొవ్వూరులో మాత్రమే అరటి పరిశోధనా స్థానం ఉంది. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు మార్కెట్‌ను విస్తరించేందుకు వీలుగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది కడప జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేందం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 70 ఎకరాల భూమిని, పరిశోధనల కోసం 628 ఎకరాల భూమిని కేటాయించింది.

అరటి పంటను వెంటాడుతున్న వెర్రితల, గొడ్డు, లీప్‌ స్టీక్‌ వైరస్‌ తెగుళ్లను పూర్తిగా నివారించేందుకు టిష్యూ కల్చర్‌ విధానంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పంట ఉత్పత్తిని పెంచేవిధంగా పరిశోధనలు సాగుతున్నాయి.

నాణ్యమైన అరటి.. కేరాఫ్‌ పులివెందుల
రాష్ట్రంలో 63.84 లక్షల టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో ఒక్క వైఎస్సార్‌ కడప జిల్లా నుంచే 23,15,300 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక్క పులివెందులలోనే 1,100 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. ఇక్కడి పంటకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా అరటి పండ్లు 6, 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి పండ్లు 14 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టిష్యూకల్చర్‌ వచ్చాక పండ్లలో నాణ్యత పెరిగింది. కడప జిల్లాలో పండే అరటిలో 80 శాతం చెన్నై, బెంగళూరు నగరాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఢిల్లీ నుంచి విదేశాలకు..
పులివెందులలో పండించిన అరటి పంట విదేశాలకు ఎగుమతి అవుతోంది. అరటి కోతల సమయంలో ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి కొచ్చి గెలలు కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండిన అరటి వారం రోజులపాటు నిల్వ చేసినా దెబ్బతినవు. నాణ్యతతో కూడిన అరటి కావడంతో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎక్కువగా టిష్యూకల్చర్‌ను సాగు చేస్తున్నాం. ఇంకా తెగుళ్లను తట్టుకునే నాణ్యమైన మొక్కలను సరఫరా చేసి రైతులకు అందించాలి. ఇందుకోసం పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.      
– శ్రీరామిరెడ్డి, అరటి రైతు, భూమయ్యగారిపల్లె, వైఎస్సార్‌ కడప జిల్లా

ఎగుమతి కేంద్రం అవసరం
పదెకరాలలో అరటి సాగు చేశా. మంచి దిగుబడి వస్తోంది. ఇక్కడ అరటి పండ్లు నాణ్యంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం హర్షణీయం. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఎగుమతి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే రైతులకు మేలు కలుగుతుంది.     
– గంగాధరరెడ్డి ఆలియాజ్‌ బాబు, అరటి రైతు, లింగాల, వైఎస్సార్‌ కడప జిల్లా

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా