ఈ పేపర్లు ఏం చేసుకోవాలి?

12 Dec, 2014 02:06 IST|Sakshi

తరిమెల (శింగనమల) : ‘ఏ ఒక్క రైతుకూ రుణ మాఫీ సక్రమంగా చేయలేదు.. రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి మాట మార్చారు. రైతుకు రూ.ఒకటిన్నర లక్ష వరకు రుణమాఫీ అని చె ప్పారు. కనీసం అది కూడా వేయకుండా మోసం చేశార’ని రైతు సాధికరత సదస్సుకు వచ్చిన రైతులు గురువారం అధికారులను నిలదీశారు. ఈ  సంఘటన శింగనమల మండలం తరిమెలలో చోటుచేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు సదస్సును బాయ్ కాట్ చేశారు.  
 
 తరిమెల గ్రామంలో రుణ మాఫీపై రైతు సాధికారత సదస్సు ప్రారంభం కాగానే.. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేసిందని, అందుకు గాను రైతులకు విముక్తి పత్రాలు అందించనున్నట్లు ఎంపీడీఓ లలితకుమారి తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.‘ఈ పత్రాలు తీసుకుని ఏం చేయూలి? అంతా మోసం చేశారు.. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, రకరకాల పేరుతో తగ్గించేశారు.. గ్రామంలో ఎంత మందికి పూర్తిగా రుణం పోయిందో చెప్పండ’ని అధికారులను నిలదీశారు.
 
  పత్రాలను బ్యాంకులకు తీసుకుని పోతే, రేపు తిరిగి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు నచ్చజెప్పారు. ఈ విషయూన్ని ఎంత వరకు నమ్మాలని.. అక్కడే ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మనోహర్‌ను రైతులు ప్రశ్నించారు. బ్యాంకులకు అలాంటి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఎందుకూ ఉపయోగం లేని ఈ పత్రాలు ఎందుకని అధికారులను ప్రశ్నించారు. బ్యాంకులలో మాఫీ అయినప్పుడు ఇస్తే తీసుకుంటామని, అంతవరకు ఈ పత్రాలు మీదగ్గరే పెట్టుకోవాలని అధికారులకు సూచించారు.
 
  రైతులు హనుమంతురెడ్డి, బాలిరెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, సీపీఐ నాయకులు రామాంజినేయులు మాట్లాడుతూ రైతులను నిలువునా మోశారని ఆవేదన చెందారు. రుణాలు పూర్తిగా మాఫీ అని చెప్పి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత మాట మార్చారన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రైతులను మోసం చేశారన్నారు. రూ.50 వేలు ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఇది రైతులను దగా చేయడమేనన్నారు. పింఛన్ల విషయంలో కూడా అలాగే చేశారని మండిపడ్డారు. గ్రామంలో 90 మంది పింఛన్లు తొలగిస్తే, కేవలం 10 మందికి మాత్రమే పునరుద్దరించారని, మిగిలిన వారికి రాలేదని ప్రశ్నించారు. గ్రామంలో ఇంకా చాలా మంది రైతుల పేర్లు రుణ మాఫీ జాబితాలో లేవన్నారు. రైతులకు పూర్తిగా మాఫీ అయిన తరువాత ఈ పత్రాలు అందించాలని రైతులందరం బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పి అందరు వెళ్లిపోయారు. దీంతో సదస్సును అధికారులు నిలిపి వేశారు. సదస్సులో ఈఓఆర్‌డీ యశోదమ్మ, ఏఏఓ శైలజ, ఆత్మ పీపీఎం లావణ్య, వీఆర్వో భరత్‌కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆదినారాయణ పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు