ఆ గ్రామం ఏమైంది..? 

17 Mar, 2019 11:55 IST|Sakshi
మాయమైన ఆనందపురం గ్రామం

సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్న కొండప్రాంతంలో ఒడిశా  రాష్ట్రానికి చెందిన 10గిరిజన కుటుంబాలను వైకుంఠపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం జన్మభూమి కమిటీ సభ్యుడు సంపతిరావు చినబాబు తన స్వార్థ రాజకీయాల కోసం, వారి వ్యవసాయ పనుల కోసం ఉపయోగ పడతారని ఇక్కడికి  తీసుకువచ్చారు. వారంతా 2015వ సంవత్సరంలో కొరగాం పంచాయతీ పరిధిలో ఉన్న కొండల్లో  పూరిపాకలు నిర్మించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

వారు వచ్చిన అర్ధసంవత్సర కాలంలోనే వారి కోసం అధికారులు లక్షల రూపాయలు వెచ్చించి ఒక మంచినీటి బావి, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా అందజేశారు. వారిలో 29మందికి ఓటు హక్కు కల్పించి రేషన్‌ కార్డులు మంజూరు చేశారు. వారి పిల్లలను వైకుంఠపురం పాఠశాలలో చేర్పించారు. ఆ గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే వారంతా ఆ గ్రామంలో  రెండు సంవత్సరాలు ఉన్నారు. వారికి ఏం కష్టమొచ్చిందో  ఏమో? గానీ గత ఏడాది మే నెలలో రాత్రికి రాత్రే బస ఎత్తేశారు. దీంతో లక్షల రూపాయలు ప్రజాథనం వృథా అయింది.

గ్రామానికి గ్రామం లేక పోయినా అధికారులు మాత్రం అక్కడి వారి ఓట్లను తొలగించలేదు. గ్రామాల్లో నివాసం ఉన్నవారి ఓట్లు మాత్రం ఇష్టానుసారం తొలగిస్తున్నారు. ఆనందపురంలో ప్రజలు లేకపోయినా ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా అవుతోందంటే ఆ గ్రామస్తుల కోసం కాదని, రాజకీయ నాయకుడి కోసమేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ గిరిజన ఓటర్లంతా ఒడిశా రాష్ట్రంలోని వారి సొంత ప్రాంతానికి చేరుకుని ఉంటారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు