ఇదేమిటి.. రామయ్య!

17 Jan, 2015 02:04 IST|Sakshi
ఇదేమిటి.. రామయ్య!

రాజంపేట: రాష్ట్ర విభజన కాకముందు రెండవ భద్రాద్రిగా వెలుగొందిన ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని విభజన తర్వాత మొదటి భద్రాద్రిగా గుర్తించి అధికారిక నవమి ఉత్సవాలు చేపడతారనుకుంటే నిరాశే మిగులుతోంది. ఈ ఉత్సవాలు ఇతర ప్రాంతాలకు తరలిపోయేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి మహోత్సవాలు భద్రాచలంలో నిర్వహించేవారు.

భద్రాచలం ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక పురాతన  గొప్ప రామాలయం ఒంటిమిట్టలోదే. భారతదేశంలోని గొప్ప కట్టడాల్లో ఒంటిమిట్ట రామాలయం కూడా ఒకటని విదేశీ యాత్రికుడు తావర్నియర్ ప్రశంసించారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరపాలని అందరూ కోరుకుంటున్నారు.
 
మరో రామాలయూనికి అధికారిక గుర్తింపునకు ప్రయత్నాలు..
 ఆంధ్రా భద్రాద్రిగా ఒంటిమిట్ట కోదండరామాలయూనికి అధికారిక గుర్తింపు లభించే సమయంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తమ ప్రాంతంలోని రామాలయూనికి ఆ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు విజయనగరం జిల్లా మెలిమర్ల మండలం రామతీర్థం రామాలయంలో చేపట్టాలని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కృషి చేస్తున్నారని తెలియడంతో జిల్లాలోని రామభక్తుల్లో ఆందోళన నెలకొంది. అయితే ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రభుత్వపరంగా జరిపించడానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులను కోరడానికి ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ దేవస్థాన పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయింది. ఈ కమిటీ స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను కలిసి అధికార బ్రహ్మోత్సవాలు ఒంటిమిట్ట కోదండరామాలయంలో నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరనున్నారు.
 
ఆలయ విశిష్టతలోకి వెళితే..
ఒంటిమిట్ట కోదండరామాలయం దేశంలో రెండవ అయోధ్యగా, రాష్ట్రంలో రెండవ భద్రాద్రిగా గుర్తెరిగినది. ఈ రామాలయంలోని మూలవిరాట్‌లను త్రేతాయుగంలో ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ రామాలయంలోని సీతారామలక్ష్మణులు విడివిడిగా కనిపించినా ఒకే రాతిలో ఉండటంతో ఏక శిలానగరంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోని ఏ రామాలయంలోనైనా ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. ఈ రామాలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉండదు.

ఎందుకంటే శ్రీరామహనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగిందనేది కథనం. ఒంటిమిట్ట రామాలయానికి ఉన్నంత పవిత్రత, ప్రాసత్యం, శిల్పకళాసంపద మరే రామాలయంలోనూ లేదు. ఒంటిమిట్ట రామాలయంలోని మధ్య మంటపంలో 31స్తంభాలు ఉన్నాయి. చూపరులను ఆకట్టుకునే శిల్పసంపద, విశాలమైన ప్రాంగణం ఈ రామాలయంలోనే ఉంది. సహజ పండితుడైన పోతనామాత్యుడు శ్రీమదాంద్ర భాగవతం ఇక్కడే రచయించి శ్రీరామునికే అంకితం ఇచ్చారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో పోతన భాగవత తాంబూల సంప్రదాయం బ్రిటీషు కాలం నుంచి ఉంది.

దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతారామలక్ష్మణులు ఇటుగా వెళుతున్న సమయంలో సీతమ్మకు ఒంటిమిట్టలో దాహం వేయగా ఆమె దాహం తీర్చేందుకు రామలక్ష్మణులు బాణాలు సంధించగా ఏర్పడిన నీటి బుగ్గలే శ్రీరామలక్ష్మణుల తీర్థాలుగా ఇప్పటికీ ఉన్నాయి. కడప నవాబు ఈ రామాలయ ఆవరణంలో ఒకబావిని తవ్వించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ తన ఉద్యోగానికి రాజీనామా చేసి జీవితాన్ని రామాలయ అభివృద్ధి కోసం అంకితం చేసిన వావిలకొలను సుబ్బారావు ఊరూరాా భిక్షమెత్తి ఒంటిమిట్ట రామాలయానికి కొన్ని కోట్లరూపాయల విలువ చేసే ఆభరణాలు, భూములు, భవనాలు సమకూర్చారు. ఇంతటి చరిత్ర ఉన్న ఒంటిమిట్ట కోదండరామాలయూన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక బ్రహోత్సవాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు