ఇదేం రోగం..?

6 Mar, 2018 10:31 IST|Sakshi
ప్రభుత్వాసుపత్రి

ప్రభుత్వాస్పత్రి ఉద్యోగులు  అధికారుల ఇంటి పనులకా..? 

రోగులకు సేవకులు లేరు గానీ, అధికారుల అడుగులకు మడుగులా

అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో  పెచ్చుమీరుతున్న పెత్తనం

పలువురి ఇళ్లలో పనుల కోసం   కిందిస్థాయి సిబ్బంది

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పైస్థాయి అధికారుల పెత్తనం పెరిగిపోయింది. సరైన సిబ్బంది లేక రోగులను బంధువులే మోసుకెళ్లాల్సిన పరిస్థితులు ఇక్కడుంటే, పదుల సంఖ్యలో ఉద్యోగులను స్వప్రయోజనాలకు వాడుకుంటున్న ఆస్పత్రి అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఒకరు, ఇంటి అవసరాల కోసం ఇంకొకరు.. ఇలా నాలుగో             తరగతి ఉద్యోగులను తమ ఇష్టానుసారం వాడుకుంటున్న తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది.

లబ్బీపేట (విజయవాడతూరు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోని ఓ అధికారి అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి అండతో తన ఇంటి వద్ద పనులు చేసేందుకు నలుగురు ఉద్యోగులను కేటాయించాలని హుకుం జారీ చేశారు. ఇంకేముంది.. అడిగిందే ఆలస్యం సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ ఇద్దరిని, వార్డులో విధులు నిర్వహించాల్సిన నాల్గో తరగతి ఉద్యోగులు ఇద్దరినీ కేటాయించారు. ఒకరు నిత్యం ఆ అధికారి కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు కేటాయించగా, మరొకరు ఇంటి వ్యవహారాలు చూసేందుకు నియమితులయ్యారు.

నిత్యం ఇద్దరు ఉద్యోగులు ఆమె ఇంట్లో పనులు చేస్తుంటారు. ఇటీవల కుక్క వ్యవహారాలు చూసే ఉద్యోగి బంధువు మృతిచెందడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించారు. ఇలా.. శోభ, యేసయ్య అనే ఉద్యోగులతో పాటు మరో ఇద్దరు ఆ అధికారి సేవలోనే ఉంటున్నట్లు తెలిసింది. మరో అధికారి ఇంట్లో ఇద్దరు, సూపర్‌వైజర్‌ వద్ద మరో ఇద్దరు ఉద్యోగులు ఇంటి పనులు చక్కబెడుతూ ఆస్పత్రి విధులకు డుమ్మా కొడుతున్నారు. 

రోగులకు తప్పని కష్టాలు
ఉద్యోగులు అధికారుల ఇళ్లలో పనులు చక్కబెడుతుండగా, రోగులకు సేవలు అందించేవారు లేక బంధువులే వీల్‌చైర్‌లు, స్ట్రెచ్చర్‌పై ఎక్స్‌రేలు, స్కానింగ్‌లకు తీసుకెళ్లాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ఒక్కో సమయంలో రోగులను బంధువులే చేతులపై ఎత్తుకెళ్లడం జరుగుతోంది. అత్యవసర విభాగంలో సిబ్బందిని సైతం తమ సొంత పనులకు కేటాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కలెక్టర్‌ గారూ దృష్టిపెట్టండి
ఆస్పత్రిలో ఉద్యోగులు లేరంటూ ప్రతిసారీ ఆరోగ్యశ్రీలో ఉద్యోగులను నియమించాలని కలెక్టర్‌ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. రోగుల కోసం అలా నియమించిన వారిని సొంత అవసరాలకు వాడుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్‌ దీనిపై దృష్టిసారిస్తే.. అనేక అవకతవకలు బయట పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. 


చోద్యంచూస్తున్న అధికారులు
అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఓ అధికారి.. సిబ్బందిపై పెత్తనం చేస్తూ సొంత అవసరాలకు వాడుకుంటున్నా  ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఇటీవల తన ఇంట్లో ఫంక్షన్‌ జరగ్గా, ఆస్పత్రి క్యాంటీన్‌ నుంచి డిమాండ్‌ చేసి భోజనాలు తీసుకెళ్లారు. ఆదివారం సెలవులో ఉన్న సిబ్బందిని పిలిపించి మరీ భోజనాలు తీసుకురావాలని హుకుం జారీచేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆస్పత్రి ఉన్నతాధికారి అండగా, కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందిని సొంత అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

నా దృష్టికి రాలేదు
ఆస్పత్రిలో నాల్గో తరగతి ఉద్యోగులు.. అధికారుల ఇళ్లలో పనులు చేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అలాంటిది ఏమైనా ఉంటే ఇక నుంచి జరగకుండా చూస్తాను.
– డాక్టర్‌ జి.చక్రధర్, సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు