వాట్సప్‌..హ్యాట్సాఫ్‌!

13 Nov, 2018 12:56 IST|Sakshi

హైదరాబాద్‌ చూడాలని రైలు ఎక్కిన ఇద్దరు విద్యార్థులు

పిల్లలు స్కూల్‌కు రాకపోవడంతో తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్‌ ఫోన్‌

హెల్ప్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బీవీ సాగర్‌కు అందిన సమాచారం

వాట్సాప్‌ గ్రూప్‌లో అప్రమత్తమైన చైల్డ్‌లైన్లు

కాచిగూడలో గుర్తించి 24 గంటల్లోగా బంధువులకు అప్పగింత

ఒంగోలు టౌన్‌: కంభం పట్టణంలోని ఆల్ఫా స్కూల్‌లో ఇద్దరు విద్యార్థులు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. వారికి హైదరాబాద్‌ చూడాలన్న ఆశ కలిగింది. ఇంట్లో నుంచి స్కూల్‌కంటూ బయల్దేరారు. వారి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు స్కూల్‌లో చదువుకుంటున్నారని అనుకున్నారు. మధ్యాçహ్నం వేళ స్కూల్‌ నుంచి వారి ఇళ్లకు ఫోన్లు వచ్చాయి. మీ అబ్బాయి ఈ రోజు స్కూల్‌కు రాలేదన్నది ఫోన్‌ సారాంశం. దీంతో వారి గుండెలు ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఉదయం స్కూల్‌కు వెళ్లిన వారు మధ్యాహ్నం వరకు ఆచూకీ లేకపోవడంతో భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని హెల్ప్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ బీవీ సాగర్‌కు ఫోన్‌ చేయడం, అప్రమత్తమైన బీవీ సాగర్, చైల్డ్‌లైన్‌ (1098) జిల్లా కో ఆర్డినేటర్‌ పి. మంత్రునాయక్‌ ఈ విషయాన్ని రాష్ట్రంలోని చైల్డ్‌లైన్‌ గ్రూప్‌కు పాస్‌ చేసి ఇరవై నాలుగు గంటల్లోపు ఆ ఇద్దరు విద్యార్థులను గుర్తించి వారి బంధువులకు అప్పగించడం చకచకా జరిగిపోయాయి.

ఇదీ.. జరిగింది
స్మార్ట్‌ ఫోన్లు వినియోగించే వాటిలో వాట్సాప్‌ ఉంది. ఈ వాట్సాప్‌ కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా మేలు చేస్తూ ఉంటోంది. అందుకు ఉదాహరణే కంభంలోని ఇద్దరు విద్యార్థుల వ్యవహారం. ఆ ఇద్దరిలో ఒక విద్యార్థి తన ఇంట్లో ఉంచిన ఐదు వేల రూపాయలు తీసుకున్నాడు. శనివారం ఉదయం తన స్నేహితుడితో కలిసి కంభంలో రైలు ఎక్కాడు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు రైలు ఎక్కారు. ఆ రైలు శనివారం రాత్రికి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకొంది. అప్పటికే వారిద్దరు మిస్‌ కావడంతో చైల్డ్‌లైన్‌ గ్రూపులోని వాట్సాప్‌ ద్వారా రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లకు ఫొటోలతో సహా సమాచారం అందించారు. అప్పటికే కాచిగూడ రైల్వే పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థుల ఫొటోలను చూసి రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్నారు.

దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసిన ఆ ఇద్దరు విద్యార్థులు రైల్వే స్టేషన్‌ ఫ్లాట్‌ఫారంలో కూల్‌డ్రింక్స్, మజ్జిగ దుకాణం వద్దకు చేరుకున్నారు. రైల్వే పోలీసులు వారిని గుర్తించి దగ్గరకు తీసుకొని విచారించారు. తాము కంభం నుంచి హైదరాబాద్‌ చూద్దామని ఇళ్లల్లో చెప్పకుండా వచ్చామని చెప్పడంతో వారిని తమ వద్ద ఉంచుకున్నారు. వెంటనే వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయడం, ఒక విద్యార్థి బంధువు కాచిగూడలో వైద్యునిగా పనిచేస్తుండటం, హుటాహుటిన అక్కడకు చేరుకోవడం, అక్కడి చైల్డ్‌లైన్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ వారిని బాలల సంక్షేమ కమిటీ ముందు హాజరుపరచడం, ఇక్కడి బాలల సంక్షేమ కమిటీతో మాట్లాడి విద్యార్థులను వారి బంధువులకు అప్పగించడం, ఆదివారం కంభంలోని వారి తల్లిదండ్రులకు విద్యార్థులను అప్పగించడం చకచకా జరిగిపోయాయి. తమ పిల్లల గురించి సకాలంలో సమాచారం చేరవేసి తమకు చేర్చిన బీవీ సాగర్, మంత్రునాయక్‌లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు