ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి

1 Sep, 2017 03:41 IST|Sakshi
ఆంధ్రా అబ్బాయి.. తెలంగాణ అమ్మాయి

మతాంతర వివాహం చేసుకున్న యువతీయువకుడు
యువకుడిపై దాడి చేసిన యువతి తల్లిదండ్రులు
పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయతీ  


పోరుమామిళ్ల: రెండు మతాలకు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రేమికులు వాట్సప్‌ ప్రేమతో ఒక్కటయ్యారు. వాట్సప్‌ ద్వారా జరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. గురువారం సాయంత్రం అమ్మాయి తల్లిదండ్రులు వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్లకు వచ్చి అబ్బాయిపై దాడి చేసి కొట్టడంతో ఈ ప్రేమ వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పోరుమామిళ్లలో మోటార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న మహబూబ్‌ సుబహాన్‌ (22)కు హైదరాబాద్‌లో క్రియేటివ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న హర్షశ్రీ (19) అలియాస్‌ ఆయేషాతో వాట్సప్‌లో పరిచయమైంది. ఏడాది క్రితం మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది.

 వీరిద్దరు జూలై 24న కడప శివాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సుబహాన్‌ను బెదిరించారు. దీంతో మిత్రులు, బంధువుల సలహాతో ఆ అమ్మాయిని ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపాడు. అయితే హర్షశ్రీ అతని ప్రేమను మర్చిపోలేక నెల క్రితం పోరుమామిళ్ల వచ్చింది. ‘నీతోనే ఉంటాను, నాకు నా తల్లిదండ్రులు అవసరం లేదని’ స్పష్టం చేయడంతో సుబహాన్‌ ముస్లిం సంప్రదాయం ప్రకారం గత నెల ఆగస్టు 5న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దీంతో హర్షశ్రీ మహబూబున్నీషాగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం యువతి తల్లిదండ్రులు రవిగౌడ్, రాణి, తమ్ముడు విశ్వతేజగౌడ్‌లు పోరుమామిళ్ల వచ్చి మోటార్‌షెడ్‌లో పని చేసుకుంటున్న సుబహాన్‌పై దాడి చేశారు.

 ఈ గొడవతో జనం పోగయ్యారు. సమాచారం పోలీసులకు తెలియడంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. రవిగౌడ్‌ హైదరాబాద్‌లో కాంట్రాక్టర్‌. కుమార్తె మతాంతర వివాహం చేసుకోవడం సహించలేకనే దాడికి పాల్పడినట్లు తెలిసింది. గురువారం సీఐ, ఎస్సై ఊర్లో లేకపోవడంతో వారి సమస్యకు పరిష్కారం లభించలేదు. కాగా అమ్మాయి తాను ఇష్టపూర్వకంగానే సుబహాన్‌ను వివాహం చేసుకున్నానని, తనకు తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధం లేదని, అతనితోనే జీవిస్తానని తేల్చిచెబుతోంది. ఇదే విషయం సీఐ, ఎస్సైకి చెబుతానంటోంది.

మరిన్ని వార్తలు