కావ్య ఆచూకీ కనిపెట్టేదెన్నడో..

25 Dec, 2014 02:03 IST|Sakshi

తేరుకోని కె.తాడేపల్లి గ్రామం
ప్రత్యేక గాలింపు బృందాలు ఏం చేశాయంటున్న స్థానికులు
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

 
చిట్టినగర్ : స్థానిక కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని యానాదుల పేటలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన పసుపులేటి కావ్య(5) అదృశ్యమై 25 రోజులు దాటినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావ్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో అపహరించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి గాలింపు చర్య లు సత్ఫలితాలు ఇవ్వలేదు. కనీసం చిన్నారి ప్రాణాలతోనైనా ఉందా? అనే అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. పోలీసుల బిజీ షెడ్యూలు, మంత్రుల పర్యటనలు, ఉత్సవాలతో వారి హడావుడి వారిదేనన్నట్లు మారి పోయింది.  కావ్య సంగతి తమకు, స్థానికులకు తప్ప ఎవరికీ గుర్తులేదని, పోలీసులు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఇంకా భయాందోళనలే..

కావ్య అదృశ్యమవడంతో పేటలోని ప్రతి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది.  చిన్న పిల్లలను ఒంటరి గా బయటకు వదలాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తమ పిల్లలను పక్క ఇంటి వారికి అప్పగించి వెళుతున్నారే తప్ప ఒంటరిగా వదిలి వెళ్లడం లేదు.
 
పోస్టర్లు ఏమయ్యాయి..
 
కావ్య అదృశ్యమైన ప్పటి నుంచి పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తూ నే ఉంది. ఈ ఘటన జరిగాక చిన్నారి బంధువులను స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేయడంపాటు నామమాత్రం గా గాలింపు చర్యలు చేపట్టారని పలువురు విమర్శిస్తున్నారు. గాలింపు బృందాల ఏర్పాటు విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావ్య ఫొటోతో వాల్ పోస్టర్లను చుట్టుపక్కల గ్రామాలతోపాటు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కావ్య ప్రాణాలతో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుతుందని గ్రామస్తులతోపాటు కుటుంబీకులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు