పోస్టుల భర్తీ ఎప్పుడు..?

24 Aug, 2014 01:38 IST|Sakshi
పోస్టుల భర్తీ ఎప్పుడు..?

అసెంబ్లీలో జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. ఏపీపీఎస్‌సీ ప్రక్షాళనపై ... కింది స్థాయి సిబ్బంది ఖాళీల భర్తీపై ... నిరుద్యోగ భృతి అమలు ఎంత వరకు వచ్చిందంటూ ప్రశ్నలను సంధించారు.    
 
విభజన అనంతరం ఏపీపీఎస్‌సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) చతికిలపడింది. .. తక్షణమే దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్‌సర్వీస్ కమిషన్‌కు ప్రస్తుతం దిశానిర్దేశం కరవైందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దాదాపు 2.54 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థికశాఖ అధికారికంగా ప్రకటించిందని.. కమిషన్ పాలకమండలి సభ్యుల నియామకంలోనూ పారదర్శకంగా వ్యవ హరిస్తామని టీడీపీ ఎన్నికల అజెండాలో పేర్కొన విషయాన్ని గుర్తుచేశారు.
 
డిపార్ట్‌మెంటల్ పరీక్షలు నిర్వహించి చాలాకాలమైందని ... రాష్ట్రంలో సుమారు 70వేల మంది ఉద్యోగులు డిపార్ట్‌మెంట్ పరీక్షలు రాసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. విభజన అనంతరం ఉద్యోగుల పంపిణీ కసరత్తులో భాగంగా ప్రభుత్వం అన్ని శాఖలవారీగా ఖాళీపోస్టుల వివరాలను తెప్పించుకుని ఉంటుందని.. ఆ లెక్కలను బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏపీపీఎస్‌సీ పరీక్షకు వయోపరిమితిని 40 సంవత్సరాలకు పెంచాలని.. పరీక్షలకు హాజరయ్యే వారికి ఉచిత బస్‌పాస్ కల్పించాలన్నారు.
 
దొనకొండను రాజధానిగా ప్రకటించాలి: రాష్ట్రంలో భవిష్యత్‌లో ప్రాంతీయవాదాలకు తావివ్వకుండా ఉండాలంటే.. ఇప్పుడే దొనకొండను రాజధానిగా ప్రకటించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ డిమాండ్ చేశారు. ఆయన రాష్ట్రరాజధాని అంశంపై మాట్లాడుతూ రాజధాని ప్రాంతంపై శివరామకృష్ణన్ కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటిస్తుండగా.. మరోవైపు మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు రాజధానిపై ఇష్టానుసారంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని చెప్పారు.

గుంటూరు, విజయవాడ మధ్యనే రాజధాని నిర్మాణం అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకోవడంలో ఆంతర్యమేంటని.. ఎవరి లబ్ధికోసం ప్రభుత్వం ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తంచేశారు. రాజధాని నిర్మాణానికి 4 నుంచి 5లక్షల కోట్లు ఖర్చవుతోందని చెబుతూనే.. సింగపూర్, మలేషియా టౌన్‌లను తలదన్నే రీతిలో ఉండాలనడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు వివరించారు.

అసలే లోటుబడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం ఎక్కడైతే భూమి తక్కువ ఖర్చుతో వస్తుందో.. అటు కోస్తాకు ఇటు రాయలసీమకు మధ్యనున్న ప్రాంతమవుతుందో అక్కడ్నే రాజధాని పెట్టాలన్నారు. దొనకొండకు నీరుకావాలంటే దర్శిబ్రాంచికెనాల్ నుంచి 10టీఎంసీల వరకు తీసుకోవచ్చని.. తెలుగుగంగ ప్రాజెక్ట్ మాదిరిగా నీటివసతి కల్పించుకోవచ్చన్నారు. అక్కడ్నే ఇప్పటికే 750 ఎకరాల్లో ఎయిర్‌స్ట్రిప్ ఉందని.. హైవే కనెక్టివిటీ, రైలుమార్గం ఉందని.. దొనకొండ అన్నివిధాల రాజధానికి ప్రయోజనకరమన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా