ఫైలీన్ పరిహారం అందేదెన్నడో?

28 Nov, 2013 00:08 IST|Sakshi

జహీరాబాద్, న్యూస్‌లైన్:  నియోజకవర్గంలో అక్టోబర్ నెల చివరి వారంలో వచ్చిన ఫైలీన్ తుఫాన్ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులకు హెలిన్ తుఫాన్ రూపంలో మరో దెబ్బ పడింది. దీంతో అన్నదాతలు పంటలు చేతికందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్ మండలాల్లో 12,927 హెక్టార్లలో రైతు లు పత్తి పంటను సాగు చేసుకున్నారు. ఎకరా పత్తి పంట సాగు కోసం సుమారు రూ. 30 వేలకు పైగా ఖర్చు చేశారు.

పంట బాగా వస్తే ఎకరాలకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే పత్తి పంట సాగు సమయంలో అంటే జూన్‌లో వర్షాలు విరివిగా పడ్డాయి. దీంతో పంట ఎదుగుదల కొంత మేర దెబ్బతింది. దీం తో తరువాత అకాల వర్షాలు కూడా పంటను దెబ్బతీశాయి. దీనికి తోడు అక్టోబరు నెల చివరి వారంలో ఫైలీన్ తుఫాన్ దెబ్బకు పంట దాదాపు దెబ్బతింది. దీంతో ఎకరాలకు పత్తి 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో మొక్కకు ఐదు కాయలకు మించి కాత లేని పరిస్థితి కూడా ఉందని రైతులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం కురిసిన హెలిన్ తుఫాన్ కారణంగా పూత మొత్తం రాలిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పత్తి పంటపై పెట్టిన పెట్టుబడులు ఒక్క పైసా కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. కాత కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో రైతులకు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం, అధికారులు ఎందుకు పరిగణలోకి ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధిక వర్షాల కారణంగా పత్తి పంట ఎదగకుండా పోయిందని, చివరి దశలో ఉన్న వర్షాలు కూడా ఉన్న కొద్ది పంటను కూడా దెబ్బ తీశాయని అన్నదాత లు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. చివరి దశలో వచ్చిన వర్షాలు పంటలో అంతర కృషి చేసేందుకు వీలు లేకుండా చేసిందని వారు పేర్కొంటున్నారు.

దీంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిని అప్పుల ఊబిలోకి నెట్టిందని వాపోతున్నారు. అయినా పరిహారం కిందకు పత్తిపంటను తీసుకోక పోవడంతో ప్రభుత్వం తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంపై సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.
 ప్రభుత్వం తీరు పరిహాసం
 పత్తి పంటను సాగు చేసుకున్న రైతాంగం విషయంలో ప్రభుత్వం తీరును పలువురు తప్పుపడుతున్నారు. చేతికి అంది వచ్చిన పంట దెబ్బతింటేనే పరిహారం అంటూ మెలికలు పెట్టడం పత్తి రైతులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఫైలీన్ తుపాన్ ప్రభావంతో 70 శాతానికి పైగా పత్తి పంట పూత నేల రాలింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పత్తిపంట నలుపు రంగు మారింది. మరి ఇది నష్టం కిందకు ఎందుకు రాదో చెప్పాలని రైతాంగం ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మేధావులను ప్రశ్నిస్తోంది. పత్తి పంటను నష్టం కింద గుర్తించకుండా ప్రభుత్వం తమతో పరిహాసం ఆడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు