ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సమస్య తీరేదెప్పుడో? 

6 Mar, 2019 15:49 IST|Sakshi
శిథిల దశకు చేరుకున్న జొన్నాడ సబ్‌సెంటర్‌ భవనం

సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం): గ్రామస్థాయిలో వైద్య సేవలకు కేంద్రాలుగా ఉండే  ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత గూడు కరువైంది. అద్దె కొంపల్లో చాలీ చాలని స్థలంలో కేంద్రాలను నడుపుతున్నారు. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో గ్రామీణప్రాంతీయులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు.  ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గర్భిణులు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాకిన్‌ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు నిర్మించి చాలా కాలం కావటంతో అవి శిథిల దశకు చేరుకున్నాయి. గ్రామాలు పీహెచ్‌సీలకు దూరంగా ఉంటాయి. దీంతో గ్రామస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి కూడా కరువైంది. వైద్య సిబ్బందికి కూడా అవస్థలు తప్పటం లేదు.

డెంకాడ మండలం అక్కివరం, జొన్నాడ గ్రామాల్లో సబ్‌సెటర్‌ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో జొన్నాడలో ఉన్న సబ్‌సెంటర్‌ భవనం శిథిల దశకు చేరింది. పూసపాటిరేగ మండలంలో ఉన్న రెండు భవనాలు కూడా పాడయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

ఉన్నతాధికారులకు నివేదించాం 
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేనివాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం.  ఆయా సబ్‌సెంటర్ల వారీగా వివరాలు ఇచ్చాం. దీనికి సంబంధించి స్థలం చూపితే మంజూరు చేస్తామంటున్నారు.
– డాక్టర్‌ సత్యవాణి, డెంకాడ పీహెచ్‌సీ

పంచాయతీ భవనంలోనే విధులు
జొన్నాడలో సబ్‌సెంటర్‌ భవనం శిథిల దశకు చేరింది. పంచాయతీ భవనంలోనే వాక్సిన్లు వేస్తున్నారు.  పంచాయతీ కార్యాలయంలో సా ధారణ పాలనాపరమైన పనులు ఉంటాయి. దీంతో ప్రజలు వస్తుంటారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. 
– కె.రమణి, జొన్నాడ 

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు