బాలయ్యా.. ఎక్కడున్నావయ్యా..

10 May, 2015 04:23 IST|Sakshi

  ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు
  చంద్రబాబుకు పాత రోజులు దగ్గరపడ్డాయి
  మాఓట్లతో గెలిచి పోలీసులతో లాఠీచార్జి చేయిస్తారా
  రోడ్డుపై వంటావార్పుతో కార్మికుల నిరసన


 హిందూపురం అర్బన్ : ఎమ్మెల్యే బాలయ్య ఎక్కడున్నావ్.. ఆర్టీసీ కార్మికుల బాధలు, ఆక్రందనలు కనపించడంలేదా.. వినిపించడంలేదా.. నీవైనా మీబావ చంద్రబాబుకు చెప్పలేవా..? అంటూ ఆర్టీసీ కార్మికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నాల్గవరోజు శనివారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, ఎన్‌ఎంయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా తరలివెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణ ముందు ధర్నా చేపట్టారు. బాలయ్య ఎక్కడున్నవయ్యా.. ఇటూరావయ్యా  అని ముద్రించిన బాలయ్య ఎక్కడున్నావయ్యా.. మీ బావకు చెప్పవేమయ్యా...
 
 పోస్టర్లు ఇంటిగోడలకు అతికించారు. ఈసందర్భంగా ఎంప్లాయిస్ యూనియన్ డిపో అధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మొసలికన్నీరు కార్చుతూ కార్మికుల పక్షాన నిలుస్తానని చెప్పి మాయమాటలతో మా ఓట్లు కొల్లకొట్టారు.. ఇప్పడు మేం అలుసు అయ్యామన్నారు. న్యాయం అడగడానికి వెళ్లి ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే మహిళాకార్మికులని చూడకుండా లాఠీలతో సృహ తప్పేలా కొడతారా ప్రశ్నించారు.

ఆహర్నిశలు సంస్థఅభివృద్ధికి కష్టపడే కార్మికులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వమంటే ఎంతదౌర్జన్యామా అన్నారు. ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకులు చెన్నారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు నేను మారాను.. అవకాశమిస్తే కష్టలన్నీ తీర్చేస్తానన్న ఆయన అసలు రూపం అధికారంలో రాగానే బయటకు వచ్చింది.  గద్దెనెక్కించిన తాము మరోసారి బుద్ధిచెప్పడానికి వెనుకాడేదిలేదన్నారు. ఎన్టీయారు తనయుడు బాలకృష్ణను గెలిపిస్తే హిందూపురానికి మంచి రోజులు వచ్చేస్తాయి.

అంతా మారిపోతుందని స్థానికులను పక్కన పెట్టి గెలిపించాం. ఆయన సినిమా షికార్లకు సమయం సరిపోతోంది. మూడునెలలకు ఒకసారి వచ్చి మూడురోజులు ఉండి సొంతపనులు చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇదేనా ప్రజలకు ఇచ్చే బహుమతని విమర్శించారు. ఆర్టీసీకార్మికులు రోడ్డున పడుతుంటే ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఏఐటియుసీ డివిజన్ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ అయ్యా చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. సంస్థను ప్రయివేట్‌పరంచేయడానికి చాపకింద నీరులా సన్నాహాలు చేస్తున్నారా అని విమర్శించారు.

రోడ్డుపైనే వంటా వార్పు..భోజనాలు
 ఆర్టీసీ బస్టాండులో కార్మికులు వంటావార్పు చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డిపోపరిసరాల్లోనూ, బస్టాండులోనూ వంటలు చేయడం, కనీసం కుర్చుని తినడానికి కూడా వీలులేదన్నారు. సీఐ, ఎసైై్సలతో డిపోవద్ద భారీ బందోబస్తు కల్పించారు. బస్సులను ప్రయివేట్‌వ్యక్తులతో నడిపించడానికి బందోబస్తుగా బస్సులో పోలీసు సిబ్బందిని ఏర్పాటుచేశారు.

కార్మికుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో యూనియన్ నాయకులు ఆర్టీసీడీఎం క్వార్టర్సు ఆవరణంలో వంటావార్పు చేసి అక్కడే రోడ్డుపై భోజనాలు చేసి తమ నిరసనను వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి సభ్యులు విజయనంద్, నారాయణస్వామి, బాబయ్య, రాజారెడ్డి, సుందర్‌రాజు, టిఎస్‌నాథ్, పరమేష్, మోహన్‌రెడ్డి, లింగారెడ్డి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు