ఏదీ భరోసా?

19 Jun, 2014 00:50 IST|Sakshi
ఏదీ భరోసా?

 ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఇబ్బడిముబ్బడిగా వాగ్దానాలు చేశారు. సామాన్య ప్రజల్లో ఎన్నెన్నో ఆశలు రేపారు. డ్వాక్రా మహిళల విషయంలో నైతే చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి మీరు వాయిదాలు కట్టొద్దు... మా ప్రభుత్వం రాగానే రుణాలన్నీ రద్దు చేస్తాం అని మరీ సెలవిచ్చారు. జనం నమ్మి అధికారం చేతిలో పెట్టారు. ఇప్పుడేమో... రుణాల మాఫీపై కమిటీలు.. కాలయాపనలు.. తర్జన భర్జనలు... మరో వైపు బ్యాంకర్ల ఒత్తిళ్లు... కంతులు కట్టలేదని రుణాలు రెన్యూవల్ ఆపేస్తున్నారు. దాంతో డ్వాక్రా మహిళలు తాము నిర్వహిస్తున్న వ్యాపారాలు సజావుగా నడపడానికి బయట అప్పులు చేయాల్సివస్తోంది. సీఎం చంద్రబాబు నిర్ణయం కోసం ఆడపడుచులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.
 

సాక్షి,గుంటూరు: మహిళలకు ఏడాది ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. రుణమాఫీ ప్రకటనతో మహిళలు కంతులు చెల్లించకపోవడంతో రెన్యూవల్స్ ఆగిపోయాయి. ఈ ప్రభావం స్వయం సహాయక సంఘాలపై పడుతోంది. జిల్లాలో మొత్తం 52,837 ఎస్‌హెచ్‌జీ గ్రూపులున్నాయి. వీరు మొత్తం రూ.88,121 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఇందులో 11,971 గ్రూపులు సక్రమంగా కంతులు చెల్లించకపోవడంతో రూ.50.35 కోట్లు వరకు ఆగిపోయాయి. డ్వాక్రా రుణాల మాఫీపై ప్రభుత్వం మెలిక పెట్టి భారం తగ్గించుకునేందుకు మార్గాలను వెదుకుతోంది. ఈ నేపథ్యంలో సక్రమంగా రుణాలు చెల్లించని వారికి రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనే దానిపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
 లక్ష్యం ఇలా....
 
2014-15 బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యం రూ.808.46 కోట్లు
 మేనెల వరకు లక్ష్యం          రూ.40.61 కోట్లు
 ఇప్పటివరకు ఇచ్చింది          రూ.9.93 కోట్లు

 మందకొడిగా రెన్యూవల్స్.... జిల్లాలోని మొత్తం 57 మండలాల్లో ఈ ఏడాది 25,174 గ్రూపులకు రూ.808.84 కోట్ల రుణాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మేనెల వరకు 1388 గ్రూపులకు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 388 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇవ్వడం గమనార్హం.జిల్లాలో బొల్లాపల్లి,కారంపూడి,క్రోసూరు, మేడికొండూరు, మాచవరం, రాజుపాలెం, శావల్యాపురం,తెనాలి, తుళ్లూరు మండలాల్లో అసలు రెన్యూవల్స్ ప్రారంభం కాలేదు. చిలకలూరిపేట,గుంటూరు,గురజాల,ఈపూరు,పెదనందిపాడు,పొన్నూరు మండలాల్లో నామమాత్రంగా ఒక్కొక్క గ్రూపునకు సంబంధించిన రుణాన్ని మాత్రమే రెన్యూవల్ చేశారు. దీన్ని బట్టే స్వయం సహాయక సంఘాలకు రుణం ఏమాత్రం అందిందీ అవగతమవుతోంది. మొత్తం మీద డ్వాక్రా రుణాలపై స్పష్టత రాకపోవడంతో సంఘాల్లో స్తబ్దత నెలకొంది. లావాదేవీలు ఆగిపోయాయి. దీని ప్రభావం మహిళా సంఘాల సభ్యులు చేస్తున్న వ్యాపారాలపై పడుతోంది. గత ఏడాది 19,723 గ్రూపులకు రూ.522.86 కోట్ల లక్ష్యం కాగా,21,066 గ్రూపులకు రూ.612.24 కోట్ల రుణాన్ని ఇచ్చి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారు.ఈ ఏడాది ప్రస్తుత పరిస్ధితుల్లో నిర్దేశించిన లక్ష్యం కూడా చేరుకోవడం గగనంగా అనిపిస్తోంది.
 
లక్ష్యాలను చేరుకుంటాం...
 ఏడాది ప్రారంభం కావడం, వరుసగా ఎన్నికలు జరగడంతో ఆ హడావుడిలో లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడ్డాం. గత ఏడాది లక్ష్యం కంటే ఎక్కువగా రుణాలను ఇచ్చాం. ఈ ఏడాది మార్చి చివరినాటికి లక్ష్యాలను చేరుకుంటాం. డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.    - ప్రశాంతి, డీఆర్‌డీఏ పీడీ

మరిన్ని వార్తలు