సాధికారత ఎక్కడ?

11 Jan, 2016 01:27 IST|Sakshi

మహిళలను నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం
కోటీశ్వరులను చేస్తామంటూ.. మొండిచేయి
వేలం పేరుతో అధికారపార్టీ నాయకులకు ఇసుక రీచ్‌లు ?
ఫిబ్రవరి నుంచి కొత్త విధానం అమలు
విమర్శల నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ

 
జీతాలపెంపు పేరుతో.. అంగన్‌వాడీలను, రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచిన తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా మరో ఝలక్ ఇచ్చింది. ఇన్నాళ్లూ ఇసుక రీచ్‌లను కేటాయించి మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న చంద్రబాబు మాట తప్పారు.  వేలం పాటల ద్వారా ఇసుక రీచ్‌లను విక్రయించాలని ఇటీవల నిర్ణయించారు. అందులోనూ రీచ్‌లన్నీ అధికార పార్టీ కార్యకర్తలకే దక్కేటట్లు నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతో మహిళాసాధికారత మూన్నాళ్ల ముచ్చటగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
 
చిత్తూరు: మాట ఇచ్చి తప్పడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి రుజువు చేశారు. ఇప్పటివరకు ఇసుక రీచ్‌లిచ్చి డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న బాబు ఇప్పుడు మాట మార్చారు. పేరుకు డ్వాక్రా సంఘాలకు కేటాయించినా 90 శాతం ఇసుక రీచ్‌లను అధికార పార్టీ నేతలు ఆక్రమించి అక్రమ ఇసుక వ్యాపారాన్ని సాగించారు. ఏడాదిలో జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళల అడ్డును తొలగించేందుకు వ్యూహరచన చేసింది. ఇసుక రీచ్‌ల కేటాయింపుల్లో కొత్త విధానమంటూ కుట్రకు తెరలేపింది. వేలంపాటల ద్వారా ఇసుక రీచ్‌లను సొంత పార్టీ నాయకులకు కేటాయించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
 
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లావ్యాప్తంగా అధికారికంగా 64 ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. ఇందులో అధికారికంగా 6,16,054 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మకాలు సాగించారు. దీనికి సంబంధించి రూ.19.20 కోట్లు  ప్రభుత్వానికి రాబడి లభించింది. అన్ని రీచ్‌లను అధికార పార్టీ నేతలు ఆక్రమించి యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలించారు. చెన్నై, బెంగళూరు ప్రాంతాలకు రేయింబవళ్లు ఇసుకను తరలించారు. తద్వారా రూ.100
కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు.
 
ఇక సగటున ఒక్కొక్క క్యూబిక్ మీటరు ఇసుకను రూ.310లకు అమ్మారు. ఇందులో క్యూబిక్ మీటర్‌కు రూ.10 చొప్పున డ్వాక్రా మహిళలకు కమీషన్ ప్రకారం రూ.61.6 లక్షలు మాత్రమే ఇచ్చింది. వచ్చిన ఆదాయంలో 25 శాతం మహిళలకే ఇస్తామన్న చంద్రబాబు ఆ హామీని తుంగలో తొక్కారు.                     
 
క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
తాజాగా ఇసుక రీచ్‌లపై క్యాబినెట్‌లో చర్చించిన ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అధికార పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి వేలం పాటల పేరుతో ఇసుక రీచ్‌ల కేటాయింపు జరపనుంది.  దీంతో తెలుగుదేశం నాయకులు ఇకపై బహిరంగంగా ఇసుక వ్యాపారం చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు