ఏకగ్రీవాలకు ప్రోత్సాహమేదీ?

8 Jan, 2014 05:20 IST|Sakshi

భువనగిరి, న్యూస్‌లైన్: గత సంవత్సరం జూలైలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటికి ఇస్తామన్న నజరానా నేటికీ అందలేదు. ప్రభుత్వం ఇస్తామన్న నగదు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న ఏకగ్రీవ సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి *7లక్షల పారితోషికం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉన్న 1169 పంచాయతీల్లో 103 ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటికి కలిపి *7.21కోట్ల నిధులు రావాల్సి ఉంది.

ఎన్నికలు జరిగి ఏడు నెలలవుతున్నా ఒక్క పంచాయతీకి కూడా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక  గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచ్‌లున్నారు. కనీసం ప్రోత్సాహక నిధులు వస్తే వాటితోనైనా తాగునీరు, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేద్దామనుకుంటే ప్రభుత్వం వాటి గురించే పట్టించుకోవడం లేదని ఏకగ్రీవ సర్పంచ్‌లు వాపోతున్నారు. ఆ నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఎవరూ స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహక నగదును మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు