చిరుబ్రదర్స్‌ జాడేది..!

12 Apr, 2019 11:52 IST|Sakshi

సాక్షి, భీమవరం : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా.. భీమవరాన్ని అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతానంటూ ప్రచారం చేసిన జనసేన పార్టీ అధినేత, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొణిదెల పవన్‌కల్యాణ్, ఆయన సోదరుడు నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగేంద్రబాబు గురువారం పోలింగ్‌ రోజున కన్పించకపోవడం చర్చనీయాంశమైంది.

ప్రతిష్టాత్మకమైన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్, టీడీపీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, జనసేన అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నా నామమాత్రమేననే ప్రచారం ఉంది. గురువారం నియోజకవర్గవ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గ ఓటర్లు కావడంతో తమ ఓటు హక్కును వినియోగించుకోవడమేగాక ఎప్పటికప్పుడు ఆయాపార్టీల నాయకులు, అనుచరులతో పోలింగ్‌ సరళిని తెలుసుకుంటూ కొన్ని పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

అయితే జనసేన అభ్యర్థులు పవన్‌కల్యాణ్, నాగేంద్రబాబుకు ఇక్కడ ఓట్లు లేకపోవడంతో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం లేకపోయింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తుండటంతో భీమవరం అందరి దృష్టిని ఆకర్షించింది. అతడి సోదరుడు నరసాపురం లోక్‌సభ అభ్యర్థి నాగేంద్రబాబు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటించినా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయం జనసేన శ్రేణులను నిరాశకు గురిచేసింది.

పార్టీ అధినేత  పవన్‌కల్యాణ్‌ రాలేకపోయినా కనీసం నాగేంద్రబాబు వచ్చి ఉంటే ఓటర్లలో మరింత చైతన్యం వచ్చేదని తద్వారా పార్టీకి ఉపయోగపడేదని నాయకులు చెబుతున్నారు. నరసాపురం పార్లమెంట్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు, టీడీపీ అభ్యర్థి వేటుకూరి వెంకటశివరామరాజు, బీజేపీ అభ్యర్థి పైడికొండల మాణిక్యాలరావు, ప్రజాశాంతి అభ్యర్థి కేఏ పాల్, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు సూచనలు, సలహాలు ఇవ్వగా జనసేన అభ్యర్థి నాగేంద్రబాబు కనీసం ఎక్కడా కన్పించపోవడంతో జనసేనాని ఎక్కడంటూ చర్చించుకోవడం కన్పించింది. 

మరిన్ని వార్తలు