రేగుల్లంక వంతెన పూర్తయ్యేనా?

27 Nov, 2018 12:26 IST|Sakshi
వంతెన నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం 

ఫిల్లర్ల దశలోనే నిలిచిన పనులు

ఇబ్బందులు పడుతున్న స్థానికులు

పట్టించుకోని అధికారులు

సాక్షి, అవనిగడ్డ: ఎన్నో ఏళ్ల పోరాటం ఫలితంగా సాధించుకున్న రేగుల్లంక వంతెన నిర్మాణ పనులు పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. వంతెన నిర్మాణం చేపట్టాలని స్థానికులు ప్రజాప్రతినిధులు, అ«ధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతే అడ్డంకులు కలిగిస్తున్నా ఏమీ అనలేని పరిస్థితి. వంతెన పనులు ప్రారంభించకుంటే ఆందోళన బాట పడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
 

ఆది నుంచి వివాదాలే...
పులిగడ్డ రేగుల్లంకలో కాలిబాట వంతెన, సీసీ రహదారులు నిర్మించేందుకు రూ.1.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. 2016 నవంబర్‌లో మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది ఏప్రిల్‌లో సీసీ రహదారి పనులు చేపట్టగా నాసిరకమైన మెటీరియల్‌ వాడటంపై స్థానికులు అభ్యంతరం చెప్పడంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సిమెంట్‌ రోడ్లు నిర్మించగా, వంతెన పనులు మాత్రం నిలిచిపోయాయి.
 

ఉపసభాపతి హెచ్చరించినా...
వారం క్రితం గాంధీ క్షేత్రంలో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమావేశంలో రేగుల్లంక వంతెన నిర్మాణ విషయమై శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పంచాయతీరాజ్‌ డీఈ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనా కాంట్రాక్టర్‌తో పనులు చేయించలేకపోతున్నారని మండిపడ్డారు. పత్రికల్లో కథనాలు వచ్చినా మీలో చలనం రాలేదని ఆగ్రహించారు. అయినా ఇంతవరకూ పనులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది. 
 

మీరే సమస్య పరిష్కరించుకోవాలి...
స్థానికులు పంచాయతీరాజ్‌ ఏఈ గోపాలరావు దగ్గరకు సోమవారం వెళ్లి వంతెన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. మీరు దగ్గరుండి ఆక్రమణదారుడిని తొలగింపజేస్తే పనులు చేస్తామని ఏఈ చెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోగా పంచాయతీరాజ్‌ డీఈ రమేష్, ఏఈ గోపాలరావుని పిలిపించి వంతెన నిర్మాణ విషయమై మాట్లాడారు.

రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు దోవారి శేషు, బత్తుల శ్రీను మాట్లాడుతూ వంతెన నిర్మాణం గురించి ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు