‘పచ్చ’ బస్సు పిప్పీప్పీ..

10 Jun, 2016 02:03 IST|Sakshi
‘పచ్చ’ బస్సు పిప్పీప్పీ..

ఎర్రబస్సే ఎరుగని పల్లెల్లో
ఇంగ్లిష్ మీడియం పేరుతో పల్లెల్ని ఊడ్చేస్తున్న ప్రైవేటు స్కూళ్లు

 

(సాక్షి నెట్‌వర్క్) అది పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని ఓ తండా.. రోడ్డు కూడా సరిగా లేని ఆ తండాకు ఆర్టీసీ బస్సు లేదు.. కానీ ప్రైవేటు స్కూల్ బస్సు మాత్రం ఉదయం 7 గంటలకే వచ్చేసింది..! రారమ్మంటూ హారన్ కొట్టింది.. నాలుగేళ్ల బాబును హడావుడిగా రెడీ చేసి తీసుకొచ్చింది ఓ తల్లి.. బాబును బస్సెక్కించి టాటా చెప్పింది.. ఆ వెనుకే మరో ఐదారుగులు పిల్లలు బిలబిలమంటూబస్సెక్కికూర్చున్నారు.. పిల్లల్ని ప్రైవేటు స్కూలు బస్సు పొద్దున్నే తీసుకెళ్లడంతో ఆ తండాలో సర్కారు బడి ఉన్నా.. లేనట్టుగా ముక్కుతూ మూలుగుతూ నడుస్తోంది!! .. ఇది ఒక్క ఆ తండాలో పరిస్థితి మాత్రమే కాదు.. అలాంటి ప్రైవేటు స్కూళ్ల పచ్చ బస్సులెన్నో తండా ల్ని, మారుమూల పల్లెల్ని చుట్టుముట్టి పిల్లల్ని ఎగరేసుకుపోతున్నాయి.

రోడ్డు లేని ప్రాంతాలకు సైతం చొచ్చుకుపోతున్నాయి. పిల్లలు మాలాగా కావొద్దని, నాలుగు ఇంగ్లిష్ ముక్కలు నేర్పిస్తే ఎక్కడైనా బతుకుతారన్న ఆశతో దిగువ మధ్యతరగతి వారు కూడా తమ పిల్లలను సమీప పట్టణాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపుతున్నారు. వారి ఆశలను సొమ్ము చేసుకుంటూ ప్రైవేటు స్కూళ్లు పోటీ పడి మరీ బస్సులు పెట్టి పిల్లల్ని తీసుకెళ్తున్నాయి. ఎల్‌కేజీ నుంచి టెన్త్ వరకు విద్యార్థులను తరలిస్తున్నాయి. ఊళ్లో పిల్లలంతా ఏడు, ఎని మిది గంటల్లోపే వెళ్లిపోతుండడంతో పల్లె బడి చిన్నబోతోంది. తరగతికి ఒక్కరో ఇద్దరో మిగిలితే వాళ్లందరినీ ఒకేచోట కూర్చోబెట్టి ప్రభుత్వ బడిలో పాఠాలు చెబుతున్నారు.


 అగ్గిపెట్టెల్లాంటి బస్సుల్లో కుక్కేసి..
 ఊళ్లో ఏడింటికే బసెక్కిన పిల్లాడు ప్రైవేటు స్కూలుకు చేరుకునేది మాత్రం 9 గంటలకు! మొదటి ఊరిలో ఏడింటికి కదిలిన బస్సు ఆరేడు గ్రామాల్లో పిల్లల్ని తీసుకుని వెళ్తోంది. కొన్నిచోట్ల బస్సులు 40 నుంచి 50 కి.మీ. దూరం దాకా ప్రయాణిస్తున్నాయి. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో చిన్నారులు అంత దూరం ప్రయాణం చేయాల్సి రావడం ఎంత ప్రమాదకరమో మాసాయిపేటతోపాటు అనేక ఘటనలు కళ్లకు కట్టాయి. అగ్గిపెట్టెల్లాంటి బస్సుల్లో 80 నుంచి 100 మంది పిల్లలను కుక్కేస్తున్నారు. ఇంత మంది పిల్లలతో వెళ్తున్న బస్సుల కండీషన్ ప్రధానం. కానీ ఇది ఎవరికీ పట్ట డం లేదు. గుంతలమయమైన రోడ్లు, దానికితోడు వాటికి నిపుణులైన డ్రైవర్లు ఉండడం లేదు. చాలా బస్సుల్లో సహాయకులు ఉండడం లేదు. పిల్లల్లోనే కా స్త పెద్దవారిని చూసి గేటు వద్ద నిలబెట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో తరలిస్తున్నారు. ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్లే కొద్దీ పిల్లల సంఖ్య పెరిగిపోవడంతో ఇద్దరు కూర్చునే సీట్లో ముగ్గురు, నలుగురిని కూర్చొబెడుతున్నారు. ఇక చివరి గ్రామాల పిల్లలు నిల్చొని వెళ్లాల్సి వస్తోంది. కొన్ని బస్సుల్లో సీట్ల మధ్యలో బెంచీలను ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు.



 ఉన్న ఊర్లోనే ఇంగ్లిష్ చదువుంటే..
 ఉన్న గ్రామంలోనే బడిని పటిష్టం చేసి ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే పిల్లలను ఇన్ని కష్టాల మధ్య పట్టణాలకు ఎందుకు పంపుతామని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. స్కూలు ఫీజులతోపాటు బస్సుల్లో తీసుకెళ్లినందుకు అధికం మొత్తంలో వసూలు చేయడంతో ఆర్థికంగా పెను భారం అవుతోందని వాపోతున్నారు. అక్కడక్కడ సర్కారు బడి టీచర్లే చొరవ తీసుకొని... తాము ఇంగ్లిష్ నేర్పిస్తామని, అయితే పిల్లలందరినీ ప్రభుత్వ స్కూలుకే పంపించాలంటూ పంచాయతీల్లో తీర్మానాలు చేయిస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని స్కూళ్లు ముందుకొస్తే కొద్దిమేరకైనా పరిస్థితి మారుతుందంటున్నారు. ఇలాంటి స్కూళ్లకు ప్రభుత్వం చేయూత నిస్తే పల్లె బడి మళ్లీ కళకళలాడుతుంది.


 బస్సులెట్లా తిరుగుతున్నయంటే..
 ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ఏజెన్సీలో ఉండే గ్రామం నర్సాపూర్(బి). ఇది మండల కేంద్రం ఉట్నూర్‌కు సుమారు 12 కి.మీల దూరంలో ఉంది. ఈ గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్లదు. కానీ ఉట్నూర్‌లోని ప్రైవేటు పాఠశాలల బస్సులు నిత్యం ఈ గ్రామాల నుంచి విద్యార్థులను తరలిస్తాయి. మార్గమధ్యంలో ఉన్న ఎంద, ఉమ్రి, సాలెగూడ, జైత్రం తండా వంటి గూడేల నుంచి నిత్యం 50 మంది పిల్లలను తరలిస్తాయి. మరికొన్ని గ్రామాలకు టాటా ఏస్ వంటి ఆటోలను పెట్టి పిల్లల్ని తరలిస్తున్నారు. ఈ మండలంలో చాందూరి, నర్సాపూర్ -బి, సాలెవాడ-కె, నర్సాపూర్-జే, ఉమ్రి, సాలెవాడ -బి, వడోని వంటి గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. కానీ ప్రైవేటు పాఠశాలలు మాత్రం బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం టేకులతండాలో 25 మంది చదువుకునే పిల్లలున్నారు. ఇందులో 15 మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలలకు వెళ్తున్నారు. రోడ్డు అంతత మాత్రంగానే ఉండడంతో టేకులతండాకు ఆర్టీసీ బస్సు నడపట్లేదు. కానీ మండల కేంద్రం నుంచి రోజూ మూడు పాఠశాలలకు చెందినమూడు బస్సులు వచ్చి పిల్లలను తీసుకెళ్తున్నాయి.


 తీర్మానం సాక్షిగా..
నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం శిల్గాపురం గ్రామం అది. 900 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 120 మంది విద్యార్థులున్నారు. ఊర్లో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఉన్నా 80-90 మంది పిల్లలు 12 కిలోమీటర్ల దూరంలోని హాలియాకు వెళ్లి చదువుకుంటున్నారు. రోజూ ప్రైవేటు స్కూలు బస్సులు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తుంటాయి. గ్రామంలో నాలుగు రోజుల క్రితం బడిబాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన గ్రామసభలో గ్రామస్తులు చేసిన తీర్మానం ఏంటో తెలుసా... ‘మా గ్రామంలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.3-4 వేలు ట్రాన్స్‌పోర్ట్ కోసం చెల్లించి చదివిస్తున్నాం. ప్రభుత్వం మా ఊర్లో ఇంగ్లిష్ మీడియం స్కూలు పెడితే విద్యార్థికి రూ.2 వేలు వేసుకుని అయినా పాఠశాలను అభివృద్ధి చేసుకుని ఊర్లోనే చదివించుకుంటాం..’ అని. ఈ ఒక్క తీర్మానమే ప్రభుత్వ రంగంలో ఆంగ్ల మాధ్యమ ఆవశ్యకతను తెలియజేస్తోంది. గ్రామీణ మధ్య తరగతి కుటుంబాలు చదువు కొనుక్కునేందుకు పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తోంది. ఈ గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా ఆర్టీసీ బస్సు రాదు. కానీ ప్రైవేటు స్కూల్ బస్సులు మాత్రం రోజూ ఠంచన్‌గా రెండు ట్రిప్పులు తిరుగుతున్నాయి.
 
 
 మూతపడ్డ పాఠశాల
 నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామ జనాభా 1,350. ఇక్కడ ఐదో తరగతి వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండేది. గ్రామానికి కామారెడ్డి పట్టణం నుంచి మూడు ప్రైవేటు స్కూళ్ల బస్సులు వస్తాయి. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి, రాజంపేట గ్రామాల్లోని పాఠశాలలకు చెందిన బస్సులూ వస్తాయి. గ్రామానికి చెందిన పిల్లలందరూ ఆయా బస్సుల్లో వెళ్లడంతో ఉన్న సర్కారు బడి మూతబడింది.
 
 
 సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ బడికే పంపుతాం
 ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి సౌకర్యాలు కల్పిస్తే ప్రభుత్వ బడికే పంపుతాం. ప్రైవేటు బడుల్లో ఫీజుల భారం మోయలేక పోతున్నాం. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు పాఠశాల బస్సులో పంపడంతో ఆర్థికంగా భారం అవుతుంది. నాకున్న ఇద్దరు పిల్లలకు రవాణా ఖర్చులే సంవత్సరానికి రూ.6 వేల నుంచి రూ.7 వేలు అవుతున్నాయి. స్కూల్ ఫీజులు మరో రూ.20 వేలు కడుతున్నా. కూలి చేసుకుంటూ బతికేటోళ్లం. అంత ఖర్చు పెట్టే పరిస్థితి లేకున్నా కష్టపడి పంపుతున్నాం.    - బొల్లిగొర్ల సైదమ్మ, శిల్గాపురం
 
 
 ఇంగ్లీష్ బడి లేకే..
ఖమ్మం జిల్లా ఇల్లెందుకు 12 కి.మీ. దూరంలో ఉంటుంది రాగబోయినగూడెం.  ఇక్కడి 20 మంది పిల్లలు ఇల్లెందులోని ప్రైవేట్ స్కూలుకు వెళ్తారు. స్థానికంగా ఇంగ్లిష్ మీడియం లేకపోవడం వల్లే బస్సులో 12 కి.మీ. పంపాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామంలో మొదలైన బస్సు ఐదారు ఊర్లలోని పిల్లల్ని ఎక్కించుకుని గంటన్నర ప్రయాణించి స్కూలుకు చేరుతుంది. స్కూల్ టైం ఎనిమిదిన్నర అయితే ఏడు గంటలకే పిల్లలను బస్సెక్కించాలి. ఊళ్లోనే ఇంగ్లిష్ మీడియం బడి ఉంటే ఎక్కడికో ఎందుకు పంపుతామంటున్నారు గ్రామస్తులు.
 
 
 బస్సు ఫీజే రూ.5 వేలు..
 రాగబోయిన గూడెంలో ఇంగ్లిష్ మీడియం స్కూ ళ్లు లేవు. దీంతో ఎంత ఖర్చయినా భరించుకుంటూ ఇల్లెందుకు తోలుతున్నం. చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. బడి ఫీజు కాకుండా.. బస్సుకే ఏడాదికి రూ.ఐదు వేల పైనే వసూలు చేస్తున్నరు. పిల్లల చదువుల కంటే ఖర్చు భారం కాదని భావించి అప్పు చేసైనా చదవించాల్సి వస్తోంది - కె.కోటేశ్వర్‌రావు, రాగబోయినగూడెం, ఇల్లెందు మండలం, ఖమ్మం జిల్లా
 
బస్ చార్జీలూ భారం..
మహబూబ్‌నగర్ జిల్లాలోని మండల కేంద్రం నాగర్‌కర్నూల్‌కు గుడిపల్లి అనే ఊరు 10 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం నుంచి 45 మంది పిల్లలు రోజూ నాగర్‌కర్నూల్ వెళ్తుంటారు. గ్రామం నుంచి పాఠశాలలకు తీసుకెళ్లేందుకు యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.6,500 వసూలు చేస్తున్నాయి. పాఠశాల ఫీజులు వేలకు వేలు ఉంటే ఈ బస్సు చార్జీ తలకు మించిన భారమవుతోందని, ఒకవేళ బస్సు ఫీజు చెల్లించకపోతే ఆటోలే దిక్కని వాపోతున్నారు గ్రామస్తులు. గుడిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలున్నాయి. వీటిలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తే పిల్లలకు ఈ తిప్పలు ఉండవని తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
 
 ఇంగ్లిష్ మీడియం లేక నే పంపుతున్నం..
 మా ఊర్లో ఇంగ్లిష్ మీడియం పాఠశాల లేకపోవడం వల్లే నాగర్ కర్నూల్‌కు పిల్లల్ని పంపుతున్నం. అందరూ ఇంగ్లిష్ మీడియం చదువుతున్నరు. మా పిల్లలు తెలుగులో చదివితే భవిష్యత్తు ఇబ్బందిగా ఉంటుందని ఖర్చయినా పంపుతున్నం.   - రాములు, విద్యార్థి తండ్రి, గుడిపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
 
 
 
 ప్రభుత్వ స్కూళ్లలో  తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య

 
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 నాటికి 27,92,514కు పడిపోయింది. ఏకంగా 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో క్రమంగా పెరుగుతున్నారు. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 నాటికి వారి సంఖ్య 32,70,799కు పెరిగింది.

మరిన్ని వార్తలు