దద్దరిల్లిన బందరు

22 Oct, 2014 04:42 IST|Sakshi
దద్దరిల్లిన బందరు

దీపావళి బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు
* ఎంబీఏ విద్యార్థి మృతి    
* మరో ఐదుగురికి గాయాలు
* జిల్లాలో సంచలనం

మచిలీపట్నం : దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో మంగళవారం బందరు  దద్దరిల్లింది. అర్ధగంట పాటు భారీగా శబ్దం రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిగా బందరు బైపాస్‌రోడ్డు వెంబడి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాంబాబు తాను ఉంటున్న ఇంటి ఎదురుగానే చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు. కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు.

ఇతనికి ఇద్దరు కుమారులు కిరణ్, తులసీ, ఒక కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. కిరణ్ గుడ్లవల్లేరులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. తులసీ ఇంటర్మీడియెట్, నాగలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి తయారుచేస్తున్నారు. కిరణ్ ఉల్లిపాయ బాంబులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.

ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతోపాటు దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు పరుగులు తీశారు. అయితే, పేలుడు ధాటికి చెలరేగిన మంటల్లో చిక్కుకుని కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. ఇంట్లో ఉన్న కిరణ్ తండ్రి రాంబాబు, సోదరుడు, సోదరి, తులసీ స్నేహితుడు మాచవరానికి చెందిన దిరిశన చాణుక్య గాయపడ్డారు. పేలుడు సంభవించిన పక్క గదిలో ఉన్న ఇంటి యజమాని బంధువు పామర్తి నాగబాలకు కూడా గాయాలయ్యాయి.
 
అర్ధగంటపాటు పేలుడు, దట్టమైన పొగ
మందుగుండు సామగ్రి పేలిన ఇంటి నుంచి అర్ధగంట పాటు పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుడు జరిగిన ఇంటి నుంచి దట్టంగా పొగ బయటికి రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన గదిలో శ్లాబు పిల్లర్లు బీట్లిచ్చాయి. ఈ ఇంట్లో ఆరు గదులు ఉండగా, అన్నింటిలోనూ వస్తువులు ఛిద్రమయ్యాయి. గుమ్మాలు, కిటికీలు, వాటి తలుపులు ఊడి కిందపడ్డాయి. ప్రహరీ, ఇంటి గోడ ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం పెద్దగా రావటంతో తొలుత అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని భావించారు.

అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసి, కిరణ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పు తున్న సమయంలోనూ మందుగుండు సామగ్రి పేలుతూనే ఉంది. గాయపడిన వారు కింద పడిపోవటంతో ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. పేలుడు సంభవించిన గృహం వరండాలో ఐదు సంచుల తాటాకు టపాకాయలు ఉన్నాయి. ఇవి పేలకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో పేలుడు సంభవించటంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కిరణ్ సోదరుడు తులసీకి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్న చాణుక్య.. కిరణ్ అన్నయ్యకు ఏమైదంటూ దీనంగా పోలీసులను అడగడం చూపరులను కలచివేసింది. గాయాలపాలైన కిరణ్ సోదరి నాగలక్ష్మి చికిత్స పొందుతూనే ‘మా అన్నయ్య చనిపోయాడు..’ అంటూ కన్నీరుమురుగా విలపించింది. కిరణ్‌ను ఎంబీఏ చదివిస్తున్నామని, చేతికొచ్చే దశలో కళ్లెదుటే చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు రోదించారు.
 
బాధితులను పరామర్శించిన మంత్రి రవీంద్ర
ఈ ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం రాత్రి పరామర్శించారు. పేలుడు జరిగిన గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోగి తులసీ తదితరులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.  
 
ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు
బైపాస్‌రోడ్డులో పేలుడు సంభవించిన ఇంటిని బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, తహశీల్దార్ నారదముని, చిలకలపూడి సీఐలు సత్యనారాయణ, సుబ్బారావు, ఎస్‌ఐలు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు