‘కృష్ణా’కు వారసులెవరు?

5 May, 2015 03:38 IST|Sakshi
‘కృష్ణా’కు వారసులెవరు?

సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ
‘ఒక తండ్రి వారసులు పక్కవారి వాటాలు కోరతారా’ అన్న
అత్యున్నత న్యాయస్థానం
ఆ ‘వారసులు’ 2 తెలుగు రాష్ట్రాలేనా.. లేక మహారాష్ట్ర, కర్ణాటకలా?
కృష్ణా నది జలాలను వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులే అంటున్న తెలంగాణ

 
హైదరాబాద్: కృష్ణా నదికి ‘వారసుల’ అంశం తీవ్ర స్థాయిలో చర్చకు తెరలేపింది. ‘వారసుడు తల్లిదండ్రుల నుంచే ఆస్తులు కోరతాడు కానీ ఇతరుల నుంచి కోరడు కదా..’ అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు నీటి కేటాయింపుల వివాదం కేవలం తెలుగు రాష్ట్రాల మధ్యేనా?.. లేక నీటిని వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలకూ వర్తిస్తుందా? అన్న అంశంపై బుధవారం (6వ తేదీన) సుప్రీంకోర్టులో జరిగే విచారణ కీలకంగా మారింది. కృష్ణా జలాలను వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులేనని కోర్టుకు తెలంగాణ స్పష్టం చేయనుంది.


అందరూ వారసులే: కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న నాలుగు రాష్ట్రాలూ వారసులేనని తెలంగాణ బలంగా చెబుతోంది. నీటిని అందరికీ సమానంగా పంచాలని కోరుతోంది. ఈమేరకు సుప్రీం ముందు వాదించేందుకు ప్రత్యేక నోట్‌ను సైతం తయారుచేసింది. ఆ నోట్ ప్రకారం..
కృష్ణా నదిలో ఉమ్మడి ఏపీకి మొత్తం కేటాయింపులు 811 టీఎంసీలుకాగా.. రాష్ట్ర పరిధిలోని కృష్ణా బేసిన్ నుంచి 369 టీఎంసీల మేర మాత్రమే వర్షాల ద్వారా నీటి లభ్యత ఉంది. మిగతా 442 టీఎంసీలు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సిందే. అలా అయితేనే వాస్తవ కేటాయింపుల లెక్క సరితూగుతుంది. వారు లేకుండా వాటాలు తేలవు.
 

  • కృష్ణాలో కలిసే భీమా నదికి ఉపనది అయిన కాగ్నా తెలంగాణ నుంచి కర్ణాటకకు వెళ్లి.. అక్కడి నుంచి తిరిగి తెలంగాణలోకి వచ్చి భీమాలోనే కలుస్తుంది. అప్పుడు కర్ణాటకకు తెలంగాణ కింది రాష్ట్రమా? లేక పైరాష్ట్రమా?. ఈ విషయంలో ఎవరు ఎవరికి వారసులు?
  • తుంగభద్ర నది సైతం కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవహించి.. అక్కడి నుంచి తిరిగి కర్ణాటకకు వెళ్లి, ఆ తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య ఉమ్మడి సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఈ విషయంలో వారసులెవరో ఎలా తేలుస్తారు.
  • మహారాష్ట్రలో లభ్యమయ్యే 80 శాతం నీరు ఒక్క కే1 సబ్‌బేసిన్‌లోనే లభ్యమవుతోంది. ఈ కే1 నీటినే ఏపీ, కర్ణాటకలు పంచుకోవాలి.
  • ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో సబ్‌బేసిన్ల నుంచి ప్రధాన కృష్ణా బేసిన్‌లోకి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడితే... అటువంటి పరిస్థితుల్లో నీటి విడుదల ఎలా? ప్రధాన బేసిన్లో నీరు ఎక్కువగా ఉండి సబ్ బేసిన్‌లో లభ్యత తక్కువగా ఉంటే అప్పుడు సబ్ బేసిన్ ప్రాజెక్టులకు నీటిని ఎలా కేటాయిస్తారు?
  • ఈ అంశాల దృష్ట్యా స్థిరాస్తులు పంచినట్లుగా నీటి పంపకాలు చేయడం కుదరదు. ఒకరిపై ఒకరు ఆధారపడుతూ, అందరూ వినియోగిస్తున్నపుడు కృష్ణా నదికి అంతా వారసులే అవుతారు.

 

సెక్షన్ 89 పరిధి ఏంటి?
కృష్ణా నది నీటి పునఃకేటాయింపు కోరుతూ వేసిన పిటిషన్లపై గత విచారణ సందర్భంగా... రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89ను తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా ప్రస్తావించాయి. గతంలో ఏ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నిర్దిష్ట కేటాయింపులు చేయకున్నా.. నీటి ప్రవాహంలో లోటు ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి విడుదలను ట్రిబ్యునల్ పర్యవేక్షించాలని ఆ సెక్షన్ చెబుతున్న అంశాన్ని కోర్టు దృష్టికి తె చ్చాయి. నీటి కరువు పరిస్థితుల్లో ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుం దని పేర్కొన్నాయి.


అయితే ఈ పరిస్థితుల్లో ఏయే ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయవచ్చు, అది ఎంత మేరకు? అన్న దానిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని, దానికి అన్ని రాష్ట్రాల వాదనలను సమీక్షించాలని కోరాయి. దీనిపై స్పందించిన సుప్రీం.. ‘ఈ సెక్షన్ ప్రకారం వారసులు (తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు) ఆస్తులు, అప్పులు పంచుకున్నట్లు నీటిని పంచుకోవాలి తప్పితే, ఇతరుల నుంచి కాదు కదా?’ అని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ, తెలంగాణ తీవ్ర అభ్యంతరం చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు