సీమ విభజన ఎవరడిగారు?: శ్రీకాంత్ రెడ్డి

30 Jul, 2013 02:28 IST|Sakshi
సీమ విభజన ఎవరడిగారు?: శ్రీకాంత్ రెడ్డి

రాయలసీమ ప్రాంతాన్ని రెండుగా విభజించాలని అడిగిందెవరు? అసలు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎలా వచ్చింది? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సీమది తరతరాల చరిత్రని, ఒకే భాష, ఒకే సంస్కృతి గల ప్రాంతమని అలాంటి జిల్లాలను ఎలా విభజిస్తారని ధ్వజమెత్తారు. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడి ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోక పోవడం బాధాకరమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరుగనియ్యబోమని, నిర్ణయం కనుక తీసుకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు. సీమను విభజిస్తున్నారని తెలిసి కలత చెంది సీనియర్  ఐపీఎస్ అధికారి ఇక్బాల్ రాజీనామా చేశారని, ఒక పోలీసు అధికారికి ఉన్న ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానానికి లేదని ఆయన విమర్శించారు. అసలు సీమను విభజించాలని ప్రతిపాదించింది ఎవరో వారి పేర్లను బయట పెట్టాలని గడికోట డిమాండ్ చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు లేకుండా నీళ్ల కోసం కొట్టుకోకుండా సమస్యను పరిష్కారం చేయాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం తడవకోవిధంగా లీకులు ఇస్తూ అస్తవ్యస్త ప్రతిపాదనలు చేస్తున్నందుకు నిరసనగానే తాము రాజీనామాలు చేశాం తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా కానే కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత గందరగోళ పరిస్థితులతో ప్రజలు సతమతం అవుతూ ఉంటే స్పందించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏం చేస్తున్నారని గడికోట ప్రశ్నించారు. ఇంత గందరగోళం జరుగుతూ ఉంటే పరిస్థితిని సినిమా చూసినట్లు చూస్తూ ఉన్నారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు