సహకరించింది ఎవరు?

7 Oct, 2013 01:51 IST|Sakshi
సహకరించింది ఎవరు?

 పుత్తూరు, న్యూస్‌లైన్: వారిది ఉగ్రవాద చరిత్ర. పైకి చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటు న్న వారిలా నటించారు. స్థానికులు కాకపోయినా పుత్తూరులో దర్జాగా అద్దె నివాసంలో ఉంటూ మరో కంటికి తెలియకుండా ఉగ్ర కార్యకలాపాలు నడిపిస్తూ చివరికి పోలీసులకు దొరికారు. అయితే, వీరికి స్థానికంగా ఎవరెవరు సహకారం అందించారనే దిశగా పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. ఉగ్రవాదులు బిలాల్, ఇస్మాయిల్‌కు పుత్తూరు పట్టణం మేదరవీధిలో అద్దె ఇల్లు ఇప్పించడంలో సహకరించిన వారెవరో తెలుసుకునే యత్నం చేస్తున్నారు. వీరికి ఎవరెవరితో పరిచయాలున్నాయి, ఆర్నెల్లుగా ఏం చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇన్ని రోజులుగా నివాసముంటున్నా ఏం జరుగుతోందో కనీసం పక్క ఇంటికి కూడా తెలియకుండా జాగ్రత్త వహించారు. అయితే, వేరే రాష్ట్రం నుంచి వచ్చి పుత్తూరులో నివాసం ఉంటూ ఓ వర్గానికి పెద్దగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో సహకరించారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో మేదరవీధికి పై వీధిలో ఉన్న ఉగ్రవాదులు ప్రస్తుతం పట్టుబడిన ఇంట్లోకి రెండు నెలల కిందటే వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
 
 తిరుపతిలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న పుత్తూరుకు చెందిన వ్యక్తి వీరికి అద్దె ఇల్లు ఇప్పించినట్టు తెలుస్తోంది. ‘చిన్న చిన్న వ్యాపారాలు చేసి జీవనం సాగిస్తారు’ అని అతను ఇంటి యజమానికి చెప్పినట్లు సమాచారం. ఇస్మాయిల్ పుత్తూరుకు రావడానికి ముందు నగరిలోని ఇందిరానగర్‌లో రెండు నెలల పాటు ఉన్నాడని తెలిసింది. అనంతరం ఎవరికీ చెప్పకుండా రాత్రికి రాత్రే పుత్తూరుకు వచ్చేసినట్లు సమాచారం. ఇతను స్థాని కంగా పాతసామాన్ల వ్యాపారాన్ని చేసేవాడు. ఇక, పుత్తూరులో 6 నెలలుగా ఉన్న మరో ఉగ్రవాది బిలాల్ మొదట్లో గృహావసర వస్తువులను విక్రయించేవాడు. తర్వాత పండ్లు, కూరగాయల వ్యాపారం చేశాడు.
 
 పోలీసుల పాత్రపై ప్రశంసలు: పుత్తూరులో ఉగ్రవాదులను పట్టుకోవ డానికి జరిగిన సుదీర్ఘ ఆపరేషన్‌లో ఎస్‌ఐ తులసీరామ్ పాత్రపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఉగ్రవాదులను పట్టుకోవడంలో, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా తులసీరామ్‌కు పేరుంది. ఉగ్రవాదులు మకాం వేసిన ఇంట్లో ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు ఉండటంతో కాల్పులు జరపొద్దని పైఅధికారులకు తులసీరామ్ నచ్చజెప్పారు. ఒకదశలో తమిళనాడు పోలీసులకు ఓపిక నశించి వాళ్లను చంపేయండన్నారు. అయినప్పటికీ తులసీరామ్ వారికి నచ్చజెప్పి ఇంట్లో ఉన్న ఉగ్రవాదులతో హిందీలో, తమిళంలో మాట్లాడుతూ బయటకు వచ్చి లొంగిపోయేలా చేశారు.

>
మరిన్ని వార్తలు