ఉత్తములు ఎవరో !

13 Aug, 2014 01:41 IST|Sakshi
ఉత్తములు ఎవరో !

పంద్రాగస్టు పురస్కారాలపై ఉద్యోగుల్లో చర్చ
నిజమైన సేవలకు గుర్తింపు ఏదీ?
ఏటా చాంతాడంత జాబితా
విడతలవారీగా పేర్ల ప్రతిపాదనలు..వారికే పురస్కారాలు
శాఖాధిపతి నచ్చిన పేర్లకే సిఫార్సు
కలెక్టర్  చొరవతోనైనా ఉత్తములను
గుర్తిస్తారని నిజమైన ‘ఉత్తముల్లో’ ఆశ

 
 ఉత్తమ సేవలకు గుర్తుగా మంత్రి చేతుల మీదుగా   పురస్కారం అందుకోవడం అంటే గతంలో ఓ గౌరవం. ఆయాస్థాయిల్లో వారు ‘పద్మశ్రీ’ వచ్చినంత సంబరపడే వారు. ఆ ప్రశంసాపత్రం, ఫొటోలకుఫ్రేమ్ కట్టుకుని ఇంట్లో భద్రపరుచుకునేవారు. ప్రస్తుతం సీన్ మారింది. గతంలో పదుల సంఖ్యలో దక్కే పురస్కారాలు నేడు వందల సంఖ్యకు చేరాయి. ఉత్తముల ఎంపికలో పారదర్శకత, నిజాయితీ లోపించింది. నిజంగా కష్టపడి పనిచేసిన  అధికారి, సేవకుడిగా ఉన్నవారి కంటే    సిఫార్సులకే ‘ప్రశంసాపత్రం’ దక్కుతోంది. ఈ క్రమంలో కొత్త కలెక్టర్  సిద్ధార్థ్ జైన్ చొరవతో నిజమైన ఉత్తములకు గౌరవం దక్కుతుందని  ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

చిత్తూరు: జిల్లాలో 36వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 97 శాఖల పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. రోజు వారీ పాలనలో, కార్యకలాపాల్లో ఆ ఏడాది ఉత్తమ సేవలు అందించిన వ్యక్తులకు ఏడాదిలో రెండుసార్లు పురస్కారాలను అందిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి వస్తున్న ఆనవాయితీ ఇది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రభుత్వం నుంచి మంత్రి చేతుల మీదుగా,  గణతంత్ర దినోత్సవం
 
ఉత్తములు ఎవరో !

రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తారు. గతంలో ఉత్తమాధికారుల గుర్తింపు చిత్తశుద్ధితో జరిగేది. జిల్లా అంతా కలిపి 20-30 కంటే సంఖ్య దాటేది కాదు. కొన్ని శాఖల్లో ఆ ఏడాది ఉత్తమ సేవలు అందించలేదనే భావన ఉంటే అసలు పురస్కారానికి ఆ శాఖాధిపతి ఎవరి పేర్లను సిఫార్సు చేసేవారు కాదు. కాలక్రమేణ ఉత్తముల ఎంపికలో పారదర్శకత లోపించింది. 30 నుంచి వందకు, అక్కడి నుంచి 200కు సంఖ్య చేరింది. ప్రస్తుతం ఏటా 450 మంది ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు అందజేస్తున్నారు.

విడతల వారీగా పేర్ల ప్రతిపాదనలు

జిల్లా అధికారి స్థాయి నుంచి జఫేదారు దాకా ఉత్తమసేవలు అందించిన వారి పేర్లను పంపాలని కలెక్టర్ తరఫున జిల్లా యంత్రాంగానికి డీఆర్వో ఆదేశిస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఆగస్టు 14 వరకు ఁఉత్తముల* జాబితా సిద్ధం కాదు. గత ఏడాది ఎవరికి ఇచ్చాం ? అంతకు ముందు ఎవరి పేరు సిఫార్సు చేశాం? మిగిలింది ఎవరు ? వారిలో ఎవరి పేర్లు ప్రతిపాదించాలి ? అనే తరహాలోనే ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. వీరిలో విధులకు దూరంగా ఉన్నవారు ? విధి నిర్వహణలో తీవ్ర ఆరోపణలు వచ్చిన వారికి కూడా మువ్వన్నెల జెండా పండుగ రోజూ ముచ్చటగా పురస్కారాలను అందజేస్తున్నారు. దీనిపై నిజంగా ఉత్తమ సేవలు అందించిన వారు తీవ్ర వేదన పడుతున్నారు. మరోపక్క కార్యాలయంలో ఉన్నతాధికారితో మంచిగా ఉన్నవారి పేర్లకు ప్రాధాన్యం లభిస్తోంది. కాస్త ముక్కుసూటిగా ఉండి ఉన్నతాధికారి మాటను ఖాతరు చేయకుండా నిక్కచ్చిగా పనిచేసే వారి పేర్లు కూడా జాబితాలోకి ఎక్కడం లేదు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఁఉత్తముల జాబితా*లో కూడా తనదైన మార్క్‌ను చూపించి నిజమైన సేవలు అందించే వారిని గుర్తించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు