చెన్నకేశవా.. కనిపించవా?

16 Jun, 2017 12:02 IST|Sakshi
చెన్నకేశవా.. కనిపించవా?

► కిడ్నాపర్‌ ఎవరు?
► అగంతుకులా? బిడ్డల్లేనివారా?
► తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసుశాఖ
► నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు


సాక్షి,తిరుమల : తిరుమలలో బాలుడి కిడ్నాప్‌ ఘటనలో పాల్గొన్నవారు అగంతుకులా? బిడ్డల్లేని వారా? అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కిడ్నాప్‌ ఇలానేనా?: నిద్రిస్తున్న తల్లిదండ్రులను వీడి దోగాడుతూ వచ్చిన బాలుడిని ఓ వ్యక్తి గుర్తించాడు. అతను మగ బిడ్డగా నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. పైగా కన్నవారికి నలుగురు బిడ్డలు ఉన్నట్టు గుర్తించి, వారిని నిశ్చితంగా పరిశీలించాడు. ఆలయం ముందు నిద్రిస్తున్న వారిని రాత్రంతా కాపుకాచాడు. కుటుంబం నుంచి వేరుపడిన బాలుడిని ఒంటరిగానే ఎత్తుకెళ్లాడు. వెంటనే అతని భార్యగా భావిస్తున్న మహిళ కూడా వెనుకే వెళ్లి, కొంత దూరం తర్వాత ఇద్దరూ కలుసుకున్నారు.

ఆ ఆలోచనతోనే కిడ్నాప్‌ చేశారా?
కిడ్నాపర్ల చేతిలో పూర్తి స్థాయి లగేజీ ఉంది. చంటి బిడ్డ వయసురీత్యా ఏడు నెలలే. కన్నవారిని తప్ప మరొకరిని గుర్తించే అవకాశం తక్కువ. రోజులు గడిస్తే కన్నవారిని కూడా ఆ పసికందు మరచిపోయే అవకాశం ఉంది. ఆ ఆలోచనతోనే నేలపై దోగాడుతున్న బిడ్డ కోసమే ఆ దంపతులు వేచి ఉన్నట్టు తెలుస్తోంది. అదునుచూసి ఆ బిడ్డను  అపహరించుకుని ఊరుదాటిపోయారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అగంతుకులు కూడా ఇలాంటి తెలివితేటలతోనే దంపతుల తరహాలోనే వచ్చి బాలుడిని కిడ్నాప్‌ చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు
శ్రీవారి సాక్షిగా పసికందు చెన్నకేశవ కిడ్నాప్‌ కేసును తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్‌పీ జయలక్ష్మి తీవ్రంగా పరిగణించారు. దీనిపై ఆమె ప్రత్యేక బృందాలు నియమించారు. ముగ్గురు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 10 మంది ఎస్‌ఐలను నాలుగు రాష్ట్రాలకు పంపారు.

వెయ్యి కళ్లతో ఎదురుచూపు
అనంతపురం జిల్లా వజ్రకరూర్‌ మండపంలో ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, భార్య రత్నమ్మ చిన్నకుమారుడు చెన్నకేశవ. కొడుకు దూరమవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుమార్తె ప్రమీల(8), పెద్దకుమారుడు శ్రీనివాసులు (6), చిన్నకుమార్తె సువర్ణ (2)తో కలసి పోలీస్‌ రక్షణలో పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణంలోనైనా తమ బిడ్డ ఆచూకీ లభిస్తోందోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు