వ్యవసాయ వర్సిటీ వీసీ పీఠం ఎవరికో? 

9 Jul, 2020 08:58 IST|Sakshi

రేపు అగ్రి వర్సిటీ వీసీ సెర్చ్‌ కమిటీ 

రాయలసీమ వాసులకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ 

సాక్షి, యూనివర్సిటీ: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వీసీ పోస్టుకు ముగ్గురు అధ్యాపకుల ఎంపిక కోసం శుక్రవారం సెర్చ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సెర్చ్‌ కమిటీలో తమిళనాడు అగ్రికల్చర్‌ వర్సిటీ మాజీ వీసీ డాక్టర్‌ ఎన్‌.కుమార్, భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్‌ జనరల్, ఏపీ ప్రభుత్వ ఛీప్‌ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 2న సెర్చ్‌ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సమావేశం రద్దు చేశారు. తిరిగి ఈ నెల 10న సమావేశం కానున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఈ సమావేశం నిర్వహించి ముగ్గురు అధ్యాపకుల పేర్లను వీసీ పోస్టు కోసం సిఫార్సు చేయనున్నా రు. ఇక్కడ వీసీగా పనిచేసిన దామోదర నాయు డు పదవీ కాలం జూన్‌ 5తో ముగిసింది. ప్రస్తుతం మార్కెంటింగ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి తాత్కాలిక వీసీగా పనిచేస్తున్నారు.   

ఆది నుంచి అన్యాయమేనా? 
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. 50 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో రాజేంద్రనగర్‌లో వర్సిటీ ఉండగా, రాష్ట్రం విడిపోయాక గుంటూరులో ఏర్పాటు చేశారు. నూతన వర్సిటీ ఏర్పాటు సమయంలో తిరుపతిలో వర్సిటీ ప్రధాన కార్యా లయం ఏర్పాటు చేయాలని డిమాండ్లు వినిపించాయి. తిరుపతిలో వర్సిటీ ఏర్పాటుకు అన్ని హంగులు, వసతులు, పరిశోధన సౌకర్యాలు ఉన్నా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయలేదు. తిరుపతిలోని పలు పరిశోధన ప్రాజెక్ట్‌లను గుంటూరుకు తరలించారు. 2017 నుంచి 2020 జూన్‌ వరకు వీసీగా పనిచేసిన దామోదరనాయుడు కూడా తన హయాంలో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారు. పలు పరిశోధన ప్రాజెక్ట్‌లను గుంటూరు, ఇతర ప్రాంతాలకు తరలించారు.

రాయలసీమ జిల్లాల్లో అధ్యాపకులు, ఉద్యోగులు అవస్థలు పడ్డారు. గత 13 ఏళ్లుగా ఈ యూనివర్సిటీకి వీసీలుగా ఈ ప్రాంతం వారు లేరు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డిని వీసీగా నియమించారు. ఆ తర్వాత  సీమ జిల్లాలకు ఆ పదవి దక్కలేదు. ఫిబ్రవరిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌కు స్పందించి 26 మంది అధ్యాపకులు దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారికి వీసీ పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల భర్తీ అయిన వైఎస్సార్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ వీసీ పోస్టు కూడా గుంటూరు ప్రాంతానికి చెందిన అధ్యాపకుడికి ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. హార్టీకల్చర్‌ వర్సిటీ వీసీ పదవికి సెర్చ్‌ ప్రతిపాదించిన ప్యానల్‌లో సీమ ప్రాంతానికి చెందిన ఇద్దరు అధ్యాపకులు ఉన్నప్పటికీ పదవి దక్కలేదని ప్రచారం జరుగుతోంది. వ్యవసాయ వర్సిటీ వీసీ పదవి ఈ సారైనా రాయలసీమ జిల్లాలకు దక్కుతుందో లేదో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు