కరెంట్‌ షాక్‌లకు కారకులెవరు?

11 Oct, 2019 06:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : దేశవ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి పెరిగినా.. కారు చౌకగా విద్యుత్‌ అందుబాటులో ఉన్నా చంద్రబాబు హయాంలో విద్యుత్‌ చార్జీల మోత ఎందుకు మోగింది? కరెంట్‌ చార్జీల షాక్‌లకు కారకులెవరు? ఇప్పటికీ కొనసాగుతున్న ఈ భారాలకు చంద్రబాబు స్వలాభాపేక్షే కారణమయ్యిందా? కర్ణాటకలోని కుడిగీ విద్యుత్‌ కేంద్రం పీపీఏని పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తేలిగ్గా దొరకుతాయి.. కర్ణాటకలోని కుడిగీ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచీ యూనిట్‌ రూ. 4.80కి ఇవ్వడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో 2010లోనే కొనుగోలు ఒప్పందం చేసుకుంది.

360 మెగావాట్ల ఈ పీపీఏ వల్ల విభజన తర్వాత కూడా ఏపీకి ఏడాదికి 2,681 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందేది. ఈ విద్యుత్‌ చౌకగా లభించేది. 360 మెగావాట్లకు ఫిక్స్‌డ్‌ చార్జీలు (ప్లాంట్‌ నిర్మాణ వ్యయం) కింద రూ. 317 కోట్లు చెల్లించాలి. 2,681 మిలియన్‌ యూనిట్లకు లెక్కగడతారు కాబట్టి యూనిట్‌కు రూ. 1.20 మాత్రమే ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ పడుతుంది. ఇక బొగ్గు, ఇతర చార్జీలు (వేరియబుల్‌ కాస్ట్‌) యూనిట్‌కు రూ. 3.58 అవుతుంది. అన్నీ కలుపుకుంటే యూనిట్‌ రూ. 4.80కే లభిస్తుంది. కానీ కుడిగీతో ఉన్న ఒప్పందం ప్రకారం ఏడాదికి 2,681 మిలియన్‌ యూనిట్లు తక్కువ ధరకే తీసుకునే అవకాశం ఉన్నా స్వలాభం కోసం చంద్రబాబు ఇతర ప్రైవేట్‌ విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

విద్యుత్‌ నియంత్రణ మండలిపై ఒత్తిడి తెచ్చి కుడిగీ నుంచి 392 మిలియన్‌ యూనిట్లే తీసుకోవాలని షరతుపెట్టేలా చేశారు. దానివల్ల చౌకగా వచ్చే 2,681 మిలియన్‌ యూనిట్లు తీసుకునే అవకాశం లేకుండా పోవడమే కాదు 392 మిలియన్‌ యూనిట్లు మాత్రమే కొనడం వలన ఏటా ఫిక్స్‌డ్‌ చార్జీల కింద అదనంగా రూ. 274 కోట్లు ఎన్టీపీసీకి కట్టాల్సి వస్తోంది. ఇది రాష్ట్రప్రభుత్వానికి నష్టమే కాక అదనపు భారం కూడా.. ఇదంతా ప్రజలపైనే విద్యుత్‌ చార్జీల రూపంలో పడుతోంది. అందుకే మార్కెట్లో చౌకగా విద్యుత్‌ దొరికినా విద్యుత్‌ వినియోగదారులపై భారం తప్పడం లేదు.

ప్రైవేట్‌ విద్యుత్‌పైనే ప్రేమెక్కువ..
ప్రైవేటు పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారుల మీదే గత ప్రభుత్వం ప్రేమ చూపించింది. సౌర విద్యుత్‌ ధర గరిష్టంగా రూ. 6.99, పవన విద్యుత్‌ గరిష్టంగా రూ. 4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు గత సర్కార్‌ 25 ఏళ్లుకు పీపీఏలు చేసుకుంది. వాస్తవానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ స్వల్పం. కానీ ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. గత ప్రభుత్వ విధానాల ఫలితంగా ఇప్పుడు కేంద్ర విద్యుత్‌ కావాలన్నా చౌకగా లభించే వీల్లేకుండా పోయింది. కుడిగీ విషయానికే వస్తే అనుకున్న ప్రకారం 2,681 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ తీసుకుని ఉంటే యూనిట్‌ రూ. 4.80లకే లభించేంది. కానీ 392 మిలియన్‌ యూనిట్లే తీసుకోవడం వల్ల పీపీఏ చేసుకున్న మొత్తానికి ఫిక్స్‌డ్‌ ఛార్జీ చెల్లిస్తున్నాం. దీనివల్ల ఇప్పుడు కుడిగీ విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీనే యూనిట్‌ రూ. 8.10 పడుతోంది. వేరియబుల్‌ కాస్ట్‌ మరో రూ. 3.58 అదనం. అంటే యూనిట్‌ రూ. 11.68 అవుతోంది. ప్రైవేటు వ్యక్తుల కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల డిస్కమ్‌లు నష్టపోతున్నాయని నిపుణుల కమిటీ అధ్యయనంలో తేలింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా