గిద్దలూరులో గెలిచేదెవరు..?

21 Mar, 2019 08:49 IST|Sakshi
పిడతల రంగారెడ్డి, ముత్తుముల అశోక్‌రెడ్డి, అన్నా వెంకట రాంబాబు

నియోజకవర్గ ప్రజలది విలక్షణ తీర్పు

ఒక్కోసారి ఒక్కో అభ్యర్థికి పట్టం కడుతున్న ఓటర్లు

ఆ రికార్డును బ్రేక్‌ చేసే దిశగా అన్నా రాంబాబు అడుగులు

సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): గిద్దలూరు నియోజకవర్గ ప్రజలది విలక్షణ తీర్పుగా ప్రచారం ఉంది. పిడతల రంగారెడ్డి మినహా.. ఏ నాయకుడినీ ఎమ్మెల్యేగా రెండో పర్యాయం ఎన్నుకున్న దాఖలాలు లేవు. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో 1951తో పాటు 1955 ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు, తిరిగి 1972తో పాటు 1978 ఎన్నికల్లో పిడతల రంగారెడ్డి విజయం సాధించారు. అనంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేను ఓటర్లు మారుస్తూనే వచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇదే విధమైన మార్పును నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పిడతల రంగారెడ్డి తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయ్యే రికార్డును మాత్రం అన్నా రాంబాబు బ్రేక్‌ చేస్తారని, నియోజకవర్గాన్ని రెండోసారి వైఎస్సార్‌ సీపీ ఖాతాలో వేస్తారని అంటున్నారు.

నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు...
మొత్తం ఓట్లు    2,24,592
పురుషులు    1,11,858
స్త్రీలు    1,12,441
ఇతరులు    19 

పట్టుసాధించిన వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు...
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు నియోజకవర్గంపై పట్టుసాధించారు. ఈయన 2009లో పీఆర్‌పీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. తన సామాజికవర్గమైన ఆర్యవైశ్యులతో పాటు యాదవ, కాపు సామాజికవర్గాల్లో రాంబాబుకు మంచి పట్టుంది. దీనికితోడు వైఎస్సార్‌ సీపీకి అనుకూల ఓటింగ్‌ అయిన ముస్లిం, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీల అండతో ఎదురులేని నాయకునిగా ఆయన మారారు. నియోజకవర్గం నుంచి ఏటా వందమందికి పైగా విద్యార్థులను ఇంజినీర్లుగా అన్నా రాంబాబు తీర్చిదిద్దుతున్నారు. నిరుద్యోగులకు తన శక్తిమేర ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. కొందరు పేద విద్యార్థులు ఎంబీబీఎస్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. దీంతో పాటు పేదలు ఎక్కడైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిస్తే నేరుగా సహాయం అందిస్తున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వెలిగొండ ప్రాజెక్టు నీటిని నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పోరాటం చేసి సాధించారు. అప్పట్లో తిరుపతి వరకు పాదయాత్ర చేసిన ధీరత్వం కలిగిన నాయకుడు.

రాజకీయ చరిత్ర...
1951వ సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2009లో కంభం నియోజకవర్గాన్ని గిద్దలూరు నియోజకవర్గంలో కలిపారు. కంభం నియోజకవర్గంలో ఉన్న తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలు మార్కాపురం నియోజకవర్గంలో కలవగా, అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలను గిద్దలూరు నియోజకవర్గంలో కలిసాయి. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, కంభం, అర్ధవీడు మండలాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు కాంగ్రెస్‌ పార్టీ 5 పర్యాయాలు గెలుపొందింది.

టీడీపీ అభ్యర్థి పరిస్థితి ఇలా...
టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ముత్తుముల అశోక్‌రెడ్డి 2014లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోటీచేసి గెలిచి అనంతరం టీడీపీలోకి మారడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అభివృద్ధి కోసమే మారానని చెప్పి.. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమైంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసి రోడ్లు, భవనాలు, చెక్‌ డ్యామ్‌లు నిర్మించామని ప్రచారం చేసుకోవడం మినహా.. వాటి దాఖలాలు, వాటితో ప్రజలకు ఒరిగిన ప్రయోజనాలు శూన్యం. కేవలం నాయకుల జేబులు నింపుకునేందుకే ఆ పనులు చేశారన్న వాదన ప్రజల్లో వినిపిస్తోంది. అధిక ఆదాయం వచ్చే పనులను తన బినామీలతో చేయించి కోట్ల రూపాయలు సంపాదించారని, పెట్టుబడి ఎక్కువ అయ్యే పనులను కార్యకర్తలకు ఇవ్వడం వలన చాలా మంది నాయకులు నష్టపోయారని సమాచారం. టీడీపీ నాయకులే ఆయనను వ్యతిరేకించిన సందర్భాలు అనేకం. వీటన్నింటింతో నియోజకవర్గంలో అశోక్‌రెడ్డితో పాటు టీడీపీ కూడా పూర్తిగా బలహీనపడింది.

మరిన్ని వార్తలు